చప్పగా టి20 ప్రపంచకప్‌

Jun 12,2024 08:44 #Sports

అభిమానుల్లో జోష్‌ నిల్‌..
నాసిరకం పిచ్‌లే కారణమా?
టి20 ఫార్మాట్‌ అంటేనే ఫోర్లు.. సిక్సర్లు.. అభిమానుల కేరింతలు.. టీవీలకు అతుక్కుపోయిన జనాలు.. గెలుపు ఓటముల ఉత్కంఠ… వీటన్నింటి కలయిక. కానీ ఈసారి టి20 ప్రపంచకప్‌ ఆ స్థాయిలో జరగడం లేదు. ఈ మెగా టోర్నీలో బ్యాటర్లపై బౌలర్ల ఆధిపత్యం పెరిగింది. ఇందుకు ప్రధాన కారణంగా న్యూయార్క్‌లోని నాసిరకం పిచ్‌లే కారణం అంటూ మాజీ క్రికెటర్ల వాదన. భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ చేసింది 119పరుగులే. 19 ఓవర్లకే కుప్పకూలింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్‌ జట్టు 113పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు ఆలౌట్‌ అయ్యిందా! అంటే అదీ లేదు.. నిర్ణీత 20 ఓవర్లు ఆడినా విజయాన్ని సొంతం చేసుకోలేదు. ఆ తర్వాత రోజు సోమవారం దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన ఇదే పిచ్‌పై మరో మ్యాచ్‌ జరిగింది. దక్షిణాఫ్రికా 113పరుగులే చేస్తే.. బంగ్లాదేశ్‌ ఆ లక్ష్యాన్ని ఛేదించలేక 109పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు కూడా ఆలౌట్‌ అయ్యింది లేదు. ఇలా టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరుగుతుంటే క్రీడాభిమానులు నిరాశతో చప్పగా సాగుతుందంటూ తలలు బాదుకుంటున్నారు. ఒక్క న్యూయార్క్‌ పిచ్‌ కాకుండా వెస్టిండీస్‌లోని బార్బొడాస్‌, గయానా పిచ్‌ల పరిస్థితి ఇదే. ఈ టోర్నీలో డల్లాస్‌ వేదికగా జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా జట్టు కెనడా నిర్దేశించిన 195పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడమే క్రీడాకారులకు దక్కిన పెద్ద ఊరట.
ఈ ఫార్మాట్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన జట్టుకంటే.. ఛేదనకు దిగే జట్టుకు విజయావకాశాలు మెండుగా ఉంటాయని నానుడి. కానీ ఈసారి టోర్నమెంట్‌ దానికి పూర్తి రివర్స్‌లో తిరుగుతోంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన జట్లు 10సార్లు, ఛేదనకు దిగిన జట్లు 9సార్లు విజయాలను నమోదు చేసుకున్నాయి. రెండు మ్యాచ్‌లు సూపర్‌ఓవర్‌కు దారితీయగా.. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. న్యూయార్క్‌లో ఇప్పటివరకు 6మ్యాచ్‌లు జరగ్గా.. అందులో మూడు తొలిసారి, మరో మూడు ఛేదనకు దిగిన జట్లు విజయాలను నమోదుచేసుకున్నాయి.
నాసిరకం పిచ్‌లే కారణమా…
టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు చప్పగా, లో స్కోరింగ్‌ గేమ్‌లతో సాగడానికి ప్రధాన కారణం నాసిరకం పిచ్‌లే అని టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ అభిప్రాయపడ్డాడు. ఈ పిచ్‌లపై పరుగుల రాబట్టడానికి బ్యాటర్లు కష్టపడాల్సి వస్తోందని, దీంతో వారు తీవ్ర గాయాలబారిన పడాల్సి వస్తోందని అన్నాడు. ఇదే ఫార్మాట్‌లో భారత్‌ వేదికగా జరిగిన ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో రికార్డు స్కోర్లు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అయితే 20 ఓవర్లలో 287, 277 రికార్డు స్కోర్లు నమోదు చేసింది. ఈ పిచ్‌లపై అందులో సగం స్కోర్లు కూడా నమోదు కావడం లేదు.
-స్పోర్ట్స్‌ కరస్పాండెంట

➡️