ఇంటర్నెట్ డెస్క్ : గుండెపోటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఆరోగ్యంగా ఉన్నారనుకున్న ప్లేయర్లూ దీనిబారిన పడుతున్నారు. తాజాగా పూణె వేదికగా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఓ క్రికెటర్ మైదానంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అప్పటివరకూ తమతో ఆడుతున్న ఆటగాడు నిర్జీవంగా మారడంతో సహచరులంతా బాధలో మునిగిపోయారు. 35 ఏళ్ల ఇమ్రాన్ పటేల్ ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చాడు. కాసేపటికే ఎడమవైపు ఛాతీలో నొప్పిగా ఉందంటూ సహచరులకు చెప్పాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్లతో చర్చించిన అనంతరం అతడు డగౌట్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కొద్దిదూరం వెళ్లగానే కుప్పకూలాడు. దీంతో ఒక్కసారిగా ఆటగాళ్లు, ప్రేక్షకులు హడలెత్తిపోయారు. ఆ మ్యాచ్ లైవ్‌స్ట్రీమింగ్ జరుగుతుండటంతో వీడియోలు బయటకు వచ్చేశాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం మాత్రం లేదు. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.
ఇమ్రాన్ పటేల్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కొడుకు వయసు కేవలం నాలుగు నెలలు మాత్రమే. క్రికెట్ ఆడటంతోపాటు రియల్ ఎస్టేట్, జ్యూస్‌షాప్ కూడా నిర్వహిస్తున్నాడు. పూణెలోనే ఇదే ఏడాది సెప్టెంబర్‌లో హబీబ్ షేక్ అనే క్రికెటర్ కూడా క్రికెట్ ఆడుతూ ప్రాణాలు వదిలాడు. అయితే, అతడికి అప్పటికే డయాబెటిక్ సమస్య ఉంది. కానీ, ఇమ్రాన్ పటేల్‌కు మాత్రం అనారోగ్య సమస్యలేమీ లేకపోవడం గమనార్హం. తోటి క్రికెటర్ మృతిపై సహచరులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండే ఇమ్రాన్‌కు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని వాపోయారు.