క్రీడలు : ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ప్రపంచ క్రికెట్‌లో రికార్డు సాధించారు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతోన్న ఎస్‌ఎ 20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ జట్టుకు రషీద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్ల్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో అతడు తన టీ20 కెరీర్‌లో (అంతర్జాతీయ లీగ్‌లు) కలిపి మొత్తం 633 వికెట్లు సాధించారు. ఇందులో ఆఫ్ఘనిస్థాన్ తరఫున 161 వికెట్లు పడగొట్టగా, మిగిలిన 472 వికెట్లు దేశవాళీ క్రికెట్‌తో పాటు వివిధ లీగ్‌ల్లో తీశారు.
తొలిసారి కెప్టెన్‌గా జట్టు ఫైనల్‌కు…
రషీద్ ఈ రికార్డును సాధించే క్రమంలో విండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో రికార్డును బద్దలు కొట్టారు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో భాగంగా పార్ల్ రాయల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనతను సాధించారు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన రషీద్.. తన జట్టును (ఎంఐ కేప్‌టౌన్) తొలిసారి ఫైనల్స్‌కు (కెప్టెన్‌గా) చేర్చారు.
ఈ ఘనత సాధిస్తాననుకోలేదు : రషీద్
”పదేళ్ల ముందు అసలు ఈ ఘనత సాధిస్తానని అనుకోలేదు. టేబుల్‌లో టాపర్‌గా నిలిచినందుకు ఆనందంగా ఉంది. డీజే (డ్వేన్ బ్రావో) టీ20ల్లో అత్యుత్తమ బౌలర్. అతడిని అధిగమించడం గౌరవంగా భావిస్తున్నా. మున్ముందూ ఇలానే కొనసాగేందుకు ప్రయత్నిస్తా” అని రషీద్ వెల్లడించారు.
టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు ఎవరంటే …
రషీద్ ఖాన్-633, డ్వేన్ బ్రావో-631, సునీల్ నరైన్-574, ఇమ్రాన్ తాహిర్-531, షకీబ్ అల్ హసన్-492
భారత అభిమానులకూ సుపరిచితుడే..
ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్‌ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత్‌లోనూ ఎక్కువగానే ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగు క్రికెట్ అభిమానులకు సుపరిచితుడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చాన్నాళ్లు రషీద్ ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్నారు. ఇప్పుడు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన రషీద్ ఖాన్.. 461 మ్యాచుల్లో 18.08 సగటుతో ఈ ఘనత సాధించారు. వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 582 మ్యాచుల్లో 24.40 సగటుతో 631 వికెట్లు పడగొట్టారు.