ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌- ఫైనల్‌కు అల్కరాజ్‌

Jun 8,2024 08:48 #Sports

ఐదుసెట్ల హోరాహోరీ సెమీస్‌లో సిన్నర్‌పై గెలుపు
పారిస్‌: స్పెయిన్‌ యువ సంచలనం, 3వ సీడ్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రొలాండ్‌ గారోస్‌లో హోరాహోరీగా సాగిన ఐదుసెట్ల తొలి సెమీస్‌లో అల్కరాజ్‌ 2వ సీడ్‌, ఇటలీకి చెందిన జెన్నిక్‌ సిన్నర్‌ను చిత్తుచేశాడు. గత ఏడాది ఈ టోర్నమెంట్‌ సెమీస్‌కు చేరినా.. నొవాక్‌ జకోవిచ్‌ చేతిలో ఓడి ఫైనల్‌కు చేరడంలో విఫలమయ్యాడు. 2023లో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన అల్కరాజ్‌కు ఆ ఏడాది నిరాశ ఎదురైనా.. ఈసారి 3వ సీడ్‌గా బరిలోకి దిగి ఏకంగా 2వ సీడ్‌, ఇటలీకి చెందిన జెన్నిక్‌ సిన్నర్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడం విశేషం. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీస్‌లో అల్కరాజ్‌ 2-6, 6-3, 3-6, 6-4, 6-3తో 2వ సీడ్‌ జెన్నిక్‌ సిన్నర్‌పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లు ఇరువురు ఏడు చొప్పున ఏస్‌లను సంధించగా.. తొలి సర్వ్‌ను 64శాతం విజయంతంగా ముగించి మ్యాచ్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అనవసర తప్పిదాలు ఎక్కువ చేసిన సిన్నర్‌ ఓటమిపాలై ఫైనల్‌కు చేరడంలో విఫలమయ్యాడు. ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉన్న 21ఏళ్ల అల్కరాజ్‌ గత ఏడాది వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను కైవసం చేసుకొన్నాడు. అలాగే 2022లో తొలిసారి యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను కైవసం చేసుకొని కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వేటను మొదలు పెట్టాడు. సెమీస్‌లో గెలుపుతో అల్కరాజ్‌ 2024 ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. 2వ సీడ్‌గా ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలోకి దిగిన సిన్నర్‌.. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను చేజిక్కించుకొని అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను నెగ్గి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సిన్నర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఏటిపి ర్యాంకింగ్స్‌లోనూ నొవాక్‌ జకోవిచ్‌ తర్వాత 2వ స్థానంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలోకి దిగిన సిన్నర్‌ జోరుకు అల్కరాజ్‌ కళ్లెం వేశాడు. ప్రి క్వార్టర్స్‌లో నొవాక్‌ జకోవిచ్‌ గాయం కారణంగా టోర్నీనుంచి అర్ధాంతరంగా వైదొలగడంతో అల్కరాజ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌కు మార్గం సుగమమైంది. అల్కరాజ్‌ ఫైనల్‌కు చేరే క్రమంలో క్వార్టర్స్‌లో 9వ సీడ్‌ సిట్సిపాస్‌(గ్రీక్‌), ప్రి క్వార్టర్స్‌లో 21వ సీడ్‌ అగర్‌ అలియమే(కెనడా), 3వ రౌండ్‌లో 27వ సీడ్‌ కొర్డా(అమెరికా)లను చిత్తుచేశాడు. 7వ సీడ్‌ రూఢ్‌(డెన్మార్క్‌), 4వ సీడ్‌ జ్వెరేవ్‌(జర్మనీ)ల మధ్య జరిగే రెండో సెమీస్‌ విజేతతో అల్కరాజ్‌ ఫైనల్లో తలపడనున్నాడు.

➡️