పోరాడి ఓడిన ఆంధ్ర

  • సెమీస్‌కు కేరళ, తమిళనాడు, హర్యానా
  • అండర్‌-19 జాతీయ బాలికల వాలీబాల్‌ టోర్నీ

ప్రజాశక్తి-విజయవాడ స్పోర్ట్స్‌ : విజయవాడలోని పిబి సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో జరుగుతున్న అండర్‌-19 జాతీయ బాలికల వాలీబాల్‌ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. గ్రూప్‌-లీగ్‌లో అగ్రస్థానంతో నాకౌట్‌కు చేరిన ఆతిథ్య ఆంధ్రప్రదేశ్‌ జట్టు అనూహ్యంగా కేరళ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కేరళ జట్టు 25-23, 25-20, 26-16తో ఆంధ్రప్రదేశ్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. దీంతో సెమీఫైనల్‌కు చేరాలనే ఆతిథ్య జట్టు ఆశలు అడియాసలయ్యాయి. తొలి సెట్‌లో గట్టి పోటీనిచ్చిన ఆంధ్ర.. రెండో సెట్‌లోనూ ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. మూడో సెట్‌లో ఓటమిపాలై నిష్క్రమించింది. మరో పోటీలో తమిళనాడు 3-1 (25-23, 25-15, 16-25, 25-14)తో పశ్చిమ బెంగాల్‌పై, హర్యానా జట్టు 3-0 (25-12, 25-23, 25-14) ఉత్తరప్రదేశ్‌పై విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి.

➡️