చండీగఢ్ : అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఎఫ్‌ఐ) చైర్‌పర్సన్‌గా అంజు బాబీ జార్జ్ నియమితులయ్యారు. గతేడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరగగా బుధవారం కమిషన్ నియామకం జరిగింది. ఈ కమిషన్‌లో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులతో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. అంజుబాబితో పాటు రన్నర్లు జ్యోతిర్మయి సిక్దర్, సునీతా రాణి, డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా, హర్డిల్ ఎం.డి.వల్సమ్మ, స్టీపుల్‌ఛేజర్ సుధాసింగ్‌లు మహిళా సభ్యులుగా ఉన్నారు. 2003 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యపతక విజేత అయిన అంజుబాబి ఎఎఫ్‌ఐలో సీనియర్ ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహించారు.
రెండు సార్లు ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న నీరజ్ చోప్రాతో పాటు 3000 మీటర్ల స్టీపుల్ ఛేజర్ అవినాష్ సాబ్లే, 2002 ఆసియా క్రీడల్లో షాట్‌పుట్ బంగారు పతక విజేత బహదూర్ సింగ్ సాగులు మరో ఇద్దరు పురుష సభ్యులుగా నియమితులయ్యారు. ఎఎఫ్‌ఐ గత కమిషన్‌కు సాహూ చైర్మన్‌గా పనిచేశారు.
సరైన ప్రక్రియ తర్వాత ఎన్నికలు నిర్వహించామని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఎఎఫ్‌ఐ కోశాధికారి మధుకాంత్ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ఇతర నియమనిబంధనలను అనుసరించి ఐదుగురు సభ్యులు ఎన్నికయ్యారని అన్నారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌తో సంప్రదింపుల అనంతరం నీరజ్, సాబ్లే సహా నలుగురిని అథ్లెట్స్ కమిషన్‌సభ్యులుగా చేర్చినట్లు తెలిపారు. నీరజ్, సాబ్లే ఇద్దరూ ప్రస్తుతం అథ్లెట్లుగా కొనసాగుతుండటంతో అధిక సమయం కేటాయించలేమని అన్నారని, తర్వాత సభ్యులుగా కొనసాగేందుకు అంగీకరించారని అన్నారు.