క్రీడలు : ’ బుమ్రాను అర్థం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యా ‘ అని ఆసీస్ క్రికెటర్ మెక్‌స్వీనే పేర్కొన్నారు. గతేడాది జరిగిన బోర్డర్ – గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టాప్ వికెట్ టేకర్‌గా నిలిచినా సిరీస్‌ను మాత్రం ఆసీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ జట్టు ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనేని మూడు టెస్టుల్లో 4 సార్లు బుమ్రానే ఔట్ చేశారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించిన మెక్‌స్వీనీ.. భారత పేసర్‌ను అర్థం చేసుకోవడంలో ఘోరంగా విఫలమైనట్లు పేర్కొన్నారు. ” బీజీటీలో మాకు బుమ్రా నుంచి చాలా సవాల్ ఎదురైంది. అతడొక అద్భుతమైన బౌలర్. నేను అతడి బౌలింగ్‌ను అర్థం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యా. అంతకుముందు ఎప్పుడూ బుమ్రాను ఎదుర్కోకపోవడమూ దీనికి కారణం. బంతిని సరైన ప్రాంతంలో సంధిస్తే ఫలితం ఎలా వస్తుందో అతడి బౌలింగ్‌ను చూస్తే అర్థమైపోతుంది. కేవలం నేనొక్కడిని మాత్రమే కాదు.. మా జట్టులోని ఇతర ఆటగాళ్లూ బుమ్రాపై ఆధిక్యం ప్రదర్శించలేకపోయారు. నాకు అదికాస్త ఆత్మవిశ్వాసం ఇచ్చింది. నన్ను మాత్రమే కాకుండా జట్టునంతా అతడు టార్గెట్ చేశాడు” అని మెక్‌స్వీనే వ్యాఖ్యానించారు.
బుమ్రా భార్య సంజనా స్పెషల్ పోస్టు..
జస్‌ప్రీత్ బుమ్రా, క్రికెట్ వ్యాఖ్యాత సంజనా గణేశన్ నాలుగో వివాహ వార్షికోత్సవం ఇవాళ. ఈక్రమంలో సంజనా సోషల్ మీడియా వేదికగా పోస్టు షేర్ చేసింది. ”నువ్వు ఉంటే నా గుండె కొట్టుకుంటుంది. నువ్వు ఉంటే ఊపిరి పీల్చుకోగలను. నువ్వు లేకపోతే ఇంట్లో ఉన్నట్లు కూడా అనిపించదు. నువ్వుంటే భయమే ఉండదు” అని వ్యాఖ్యలను జోడించింది. సంజనా గణేశన్‌ను బుమ్రా 2021లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ 2023లో కుమారుడు అంగద్ జన్మించాడు.