Champions Trophy: జట్టు కూర్పుపై బిసిసిఐ కసరత్తు

  • బుమ్రా, కుల్దీప్‌ ఫిట్‌నెస్‌పైనే దృష్టి

ముంబయి: వచ్చే నెల 19నుంచి పాకిస్తాన్‌ వేదికగా జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆటగాళ్ల కూర్పుపై బిసిసిఐ కసరత్తు ప్రారంభించింది. ఈ టోర్నీలో ఆడే జట్లు ఒక్కొక్కటి తమ తమ జట్లను ప్రకటిస్తుండగా.. బిసిసిఐ మాత్రం బుమ్రా, కుల్దీప్‌ల ఫిట్‌నెస్‌ రిపోర్ట్‌ కోసం వేచిచూస్తోంది. ఈ టోర్నీలో ఆడే ఐదు జట్లు ఇప్పటికే తమ జట్లను ప్రకటించగా.. ఆతిథ్య పాకిస్థాన్‌, భారత్‌ ఇంకా వెల్లడించలేదు. జనవరి 12 నాటికే ప్రాబబుల్స్‌ను ప్రకటించాల్సి ఉండగా.. టోర్నీ ప్రారంభానికి నెల రోజుల ముందు అంటే జనవరి 19లోగా స్క్వాడ్‌ను ప్రకటిస్తుందని సమాచారం. టోర్నీకి వారం రోజుల ముందు వరకూ మార్పులు చేసుకొనే అవకాశం ఉంది. అయితే, టీమిండియా మాత్రం పేసర్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌ ఫిట్‌నెస్‌ రిపోర్టు రాగానే జట్టును ప్రకటించాలని చూస్తోంది. గత వారం చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌, కెప్టెన్‌ రోహిత్‌, గౌతమ్‌ గంభీర్‌ సమావేశమై జట్టు కూర్పుపై ఒక అంచనాను వచ్చినట్లు తెలిసింది. బుమ్రా వెన్నునొప్పితో ఇబ్బందిపడుతున్నాడు.

కుల్‌దీప్‌ పరిస్థితి ఇలా..

గతేడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడిన కుల్దీప్‌ ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. గజ్జల్లో గాయం కారణంగా సుదీర్ఘకాలం విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం సర్జరీ కూడా చేయించుకుని, జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్‌పై సాధన చేశాడు. ఈ నెలాఖరుకు అతడు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ జట్టులోకి స్థానం కల్పించి.. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడిస్తారని తెలుస్తోంది. చైనామన్‌ స్పిన్నర్‌గా దుబారు పిచ్‌పై కుల్దీప్‌ కీలకపాత్ర పోషిస్తాడనేది బిసిసిఐ అంచనా.

➡️