16న ఐపిఎల్‌ యజమానులతో బిసిసిఐ సమావేశం

Apr 1,2024 22:30 #2024 ipl, #BCCI, #Cricket, #Sports

ముంబయి: భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) ఐపిఎల్‌ ఫ్రాంచైజీ యజమానులతో సమావేశం కానుంది. 16న 10 ఐపిఎల్‌ ఫ్రాంచైజీల యజమానులు సమావేశానికి హాజరుకావాలంటూ బిసిసిఐ ఆహ్వానాలను పంపింది. ఈ సమావేశం ఏప్రిల్‌ 16న అహ్మదాబాద్‌లో అనధికారికంగా . జరగనుంది. ఎజెండా వివరాలు తెలియకున్నా.. ఫ్రాంచైజీల వద్ద మిగిలిన ఉన్న నగదు, ఆటగాళ్ల మార్పులు చేర్పులపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు ముందు ఈ సమావేశం జరగనుంది. ఈ ఏడాది చివర్లో జరగాల్సిన మెగా వేలం, ప్లేయర్ల నిలుపుదల, పర్స్‌ పెంపు (సుమారు రూ.100కోట్లు) ఇతరత్రా విషయాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇక సీజన్‌-17 మ్యాచ్‌లు ప్రారంభమై నెల పూర్తయి రెండో నెలలోకి ప్రవేశిస్తున్న దృష్ట్యా వాటాదారులందరితో ఓ సమావేశం నిర్వహిస్తే మంచిదనే అభిప్రాయానికి బిసిసిఐ వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ సమావేశానికి బిసిసిఐ కార్యదర్శి జే షా, అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, ఐపిఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ తదితరులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ మెగా వేలానికి ముందు నలుగురు ఆటగాళ్లను అంటిపెట్టుకునేందుకు అనుమతి ఉంది. మూడేళ్లకోసారి జరగాల్సిన మెగా వేలం చివరిసారిగా 2022లో జరగ్గా.. 2025 ఐపిఎల్‌కు ముందు మెగా వేలం నిర్వహించాల్సి ఉంది.

➡️