పంత్‌కు బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌..

టీ20 వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా అద్భుత విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌కుగానూ ‘బెస్ట్‌ ఫీల్డర్‌’ మెడల్‌ రిషబ్‌ పంత్‌ను వరించింది. సూర్యకుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా పోటీపడ్డారు. అయితే, బ్యాటుతో కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతోపాటు కీపింగ్‌తో ఆకట్టుకున్న పంత్‌ మెడల్‌ సొంతం చేసుకున్నట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ తెలిపాడు. పంత్‌కు భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ రవిశాస్త్రి మెడల్‌ అందజేశాడు. ఈ సందర్భంగా పంత్‌పై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మృత్యువుతో పోరాడి తిరిగొచ్చిన పంత్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడని చెప్పాడు. ‘పంత్ యాక్సిడెంట్ గురించి తెలియగానే కన్నీళ్లు వచ్చాయి. హాస్పిటల్‌లో నేను అతన్ని చూసినప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. అలాంటి పరిస్థితి నుంచి అతను కోలుకుని తిరిగివచ్చాడు. బిగ్గెస్ట్ గేమ్ అయిన పాక్, భారత్ మ్యాచ్‌లో సత్తాచాటాడు. అద్భుతంగా ఆఢాడు. అతని బ్యాటింగ్ గురించి మనకు తెలుసు. కానీ, సర్జరీ తర్వాత వికెట్ కీపింగ్, చురుగ్గా కదలడం చూస్తే నువ్వు ఎంత కష్టపడ్డావో అర్థమవుతుంది. మృత్యువు అంచుల దాకా వెళ్లి తిరిగొచ్చావు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచావు.’ అని వ్యాఖ్యానించాడు.

➡️