- 22నుంచి ఐపిఎల్ సీజన్-18 ప్రారంభం
- 65రోజుల్లో 74మ్యాచ్‌లు: బిసిసిఐ
ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-18 మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది. 22న మెగా టోర్నీ షురూ కానుండగా.. తొలిమ్యాచ్ జరిగే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బిసిసిఐ సన్నాహాలు చేస్తోంది. తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు. ఆరంభ వేడుకల్లో అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ సంగీత ప్రదర్శనలు ఇవ్వనున్నారు. పంజాబ్ స్టార్ ర్యాపర్ కరన్ ఔజ్లా ప్రత్యేక షోతో పాటు బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, కత్రినా కైఫ్, విక్కీ కౌషల్, త్రిప్తి దిమ్రి, మాధురీ దీక్షిత్, జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, దిశా పటాని తదితర స్టార్స్ తమ విన్యాసాలతో అలరించనున్నారు. ఆరంభ వేడుకల్లో వీరంతా ప్రత్యేక ప్రదర్శనలు చేయ నున్నారు. స్టార్ ప్రదర్శనలతో పాటు, ఇతర కార్యక్ర మాలు కూడా అట్టహాసంగా నిర్వహించేందుకు బిసిసిఐ ఏర్పాట్లు చేయనుంది. 2025 ఐపిఎల్ సీజన్‌లో మొత్తం 74మ్యాచులు 65 రోజుల పాటు జరుగుతాయి. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది.
ముంబయి కెప్టెన్‌గా సూర్యకుమార్
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ ఉన్న దృష్ట్యా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. గత సీజన్‌లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడిన నేపథ్యంలో పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. ఆదివారం చెన్నైతో జరిగే మ్యాచ్‌లో ముంబయి జట్టుకు సూర్యకుమార్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నట్లు హెడ్ కోచ్ మVల జయవర్దనే వెల్లడించారు. గత సీజన్‌లో ముంబయి జట్టు పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది.