బౌల్ట్‌, చాహల్‌ మ్యాజిక్‌

Apr 1,2024 22:28 #2024 ipl, #Cricket, #Sports
  • పేస్‌, స్పిన్‌కు హార్దిక్‌సేన విలవిల
  • ముంబయి ఇండియన్స్‌ 125/9

ముంబయి : వాంఖడే స్టేడియం. బ్యాటింగ్‌కు అనువైన పిచ్‌. ఆతిథ్య ముంబయి ఇండియన్స్‌ తొలుత బ్యాటింగ్‌. రాజస్థాన్‌ రాయల్స్‌పై పరుగుల వరదే అనిపించింది!. కానీ రాయల్స్‌ పేసర్లు ట్రెంట్‌ బౌల్ట్‌ (3/22), నండ్రె బర్గర్‌ (2/32) ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వాంఖడే పిచ్‌పై పదునైన పేస్‌ రాబట్టిన ఈ సీమర్లు.. ముంబయి ఇండియన్స్‌ను చావుదెబ్బ కొట్టారు. ట్రెంట్‌ బౌల్ట్‌ నాలుగు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టడంతో ముంబయి ఇండియన్స్‌ మళ్లీ కోలుకోలేదు. పవర్‌ప్లేలో ట్రెంట్‌ బౌల్ట్‌కు బర్గర్‌ తోడవగా.. మిడిల్‌ ఓవర్లలో స్పిన్‌ స్టార్‌ యుజ్వెంద్ర చాహల్‌ (3/11) మాయజాలం ప్రదర్శించాడు. బౌల్ట్‌, బర్గర్‌, చాహల్‌ మ్యాజిక్‌తో ముంబయి ఇండియన్స్‌ విలవిల్లాడింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (34, 21 బంతుల్లో 6 ఫోర్లు), తెలుగు తేజం తిలక్‌ వర్మ (32, 29 బంతుల్లో 2 సిక్స్‌లు) ముంబయి ఇండియన్స్‌కు గౌరవప్రద స్కోరు అందించారు.
ముంబయి విలవిల : తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ముంబయి ఇండియన్స్‌కు ట్రెంట్‌ బౌల్ట్‌ కోలుకోలేని షాక్‌ ఇచ్చాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ చివరి రెండు బంతులకు రెండు వికెట్లు పడగొట్టిన బౌల్ట్‌.. తన రెండో ఓవర్‌ రెండో బంతికి సైతం వికెట్‌ తీశాడు. రోహిత్‌ శర్మ (0), నమన్‌ దిర్‌ (0), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (0) ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్‌గా నిష్క్రమించి డగౌట్‌కు చేరుకున్నారు. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (16, 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడుతూ మెప్పించగా అతడినీ బర్గర్‌ సాగనంపాడు. దీంతో 20/4తో ముంబయి ఇండియన్స్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. కీలక బ్యాటర్లు అందరూ పవర్‌ప్లేలోనే నిష్క్రమించటంతో ముంబయి ఇండియన్స్‌ చతికిల పడింది. తెలుగు తేజం తిలక్‌ వర్మ (32), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (34) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. ఈ ఇద్దరు విలువైన ఇన్నింగ్స్‌లతో ముంబయి ఇండియన్స్‌ను మెరుగైన స్కోరు దిశగా నడిపించారు. 36 బంతుల్లో 56 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను మళ్లీ పట్టాలెక్కించారు. కానీ డెత్‌ ఓవర్ల ముంగిట వికెట్‌ కోల్పోవటంతో ముంబయి స్కోరుపై ప్రభావం చూపించింది. స్పిన్‌ స్టార్‌ యుజ్వెంద్ర చాహల్‌ వరుసగా తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యను అవుట్‌ చేసి ముంబయి ఆశలపై నీళ్లు చల్లాడు. చివర్లో టిమ్‌ డెవిడ్‌ (17, 24 బంతుల్లో 1 ఫోర్‌) వేగంగా పరుగులు సాధించటంలో విఫలమయ్యాడు. పియూశ్‌ చావ్లా (3), గెరాల్డ్‌ (4) తేలిపోయారు. 20 ఓవర్లలో 9 వికెట్లకు ముంబయి ఇండియన్స్‌ 125 పరుగులే చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌, యుజ్వెంద్ర చాహల్‌ మూడేసి వికెట్లు పడగొట్టగా.. బర్గర్‌ రెండు వికెట్లతో సత్తా చాటాడు.
స్కోర్‌బోర్డు..
ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (సి)సంజు (బి)బర్గర్‌ 16, రోహిత్‌ (సి)సంజు (బి)బౌల్ట్‌ 0, నమన్‌ ధీర్‌ (ఎల్‌బి)బౌల్ట్‌ 0, డేవిడ్‌ బ్రెవీస్‌ (సి)బర్గర్‌ (బి)బౌల్ట్‌ 0, తిలక్‌ వర్మ (సి)అశ్విన్‌ (బి)చాహల్‌ 32, హార్దిక్‌ (సి)రువాన్‌ పావెల్‌ (బి)చాహల్‌ 34, పియూష్‌ చావ్లా (సి)హెట్‌మైర్‌ (బి)ఆవేశ్‌ ఖాన్‌ 3, టిమ్‌ డేవిడ్‌ (సి)బౌల్ట్‌ (బి)బర్గర్‌ 17, కొర్ట్జె (సి)హెట్‌మైర్‌ (బి)చాహల్‌ 4, బుమ్రా (నాటౌట్‌) 8, ఆకాశ్‌ మధ్వాల్‌ (నాటౌట్‌) 4,
వికెట్ల పతనం: 1/1, 2/1, 3/14, 4/20, 5/76, 6/83, 7/95, 8/111, 9/114
బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-23-3, బర్గర్‌ 4-0-32-2, ఆవేశ్‌ ఖాన్‌ 4-0-30-1, చాహల్‌ 4-0-11-3, అశ్విన్‌ 4-0-27-0

➡️