ICC Test Rankings: టాప్‌లో బుమ్రా, జడేజా

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) తాజా టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా హవా కొనసాగుతున్నాడు. ఐసిసి బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో బుమ్రా 904 పాయింట్లతో తన అగ్రస్ధానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 5 టెస్టుల్లో 13.06 సగటుతో 32 వికెట్లు సాధించి ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌గా బుమ్రా నిలిచాడు. ఈ క్రమంలోనే తన టెస్టు రేటింగ్‌ పాయింట్స్‌ను బుమ్రా మెరుగుపరుచుకున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా తర్వాత స్ధానాల్లో వరుసగా ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌(841), దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడ(837) కొనసాగుతున్నారు.

మరోవైపు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ రవీంద్ర జడేజా తన అగ్రస్ధానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. జడేజా ఖాతాలో ప్రస్తుతం 400 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 27 సగటుతో 135 పరుగులు చేశాడు. జడేజా తర్వాత స్ధానాల్లో ప్రోటీస్‌ ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సెన్‌(294), బంగ్లా ప్లేయర్‌ మెహిదీ హసన్‌(294) నిలిచారు. ఇక బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ విషయానికి వస్తే.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ర్యాంక్‌ మరింత దిగజారింది. రోహిత్‌ ఒక స్ధానం దిగజారి 43వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో రోహిత్‌.. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.

➡️