కెనడా సంచలనం

Jun 8,2024 08:56
  • ఐర్లాండ్‌పై 12 పరుగుల తేడాతో గెలుపు
  • బ్యాటింగ్‌లో మెరిసిన కిర్టన్‌, మొవ్వ

న్యూయార్క్‌ : ఐసిసి టి20 ప్రపంచ కప్‌లో కెనడా సంచలనం సృష్టించింది. టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించడమే గొప్ప అనుకుంటే.. ప్రధాన టోర్నీలో ఏకంగా ఐర్లాండ్‌ను ఓడించింది. నసావు కౌంటీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన గ్రూప్‌-ఎ లీగ్‌ మ్యాచ్‌లో కెనడా జట్టు 12 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుచేసింది. లో స్కోరింగ్‌ గేమ్‌లో తొలుత ఐర్లాండ్‌ బౌలర్ల ధాటికి టాపార్డర్‌ విఫలమైనా.. నికోలస్‌ కిర్టన్‌(49), వికెట్‌ కీపర్‌ శ్రేయాస్‌ మొవ్వ(37)లు ఉతికేశారు. ఐర్లాండ్‌ బౌలర్లను సమర్దంగా ఎదుర్కొని జట్టుకు పోరాడగలిగే స్కోర్‌ అందించారు. దీంతో కెనడా 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఐర్లాండ్‌ బౌలర్లలో మెక్‌కార్తీ, యంగ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. కెనడా ఓపెనర్లు నవ్‌నీత్‌ ధలివల్‌(6), అరోన్‌ జాన్సన్‌(14)లు స్వల్ప స్కోర్‌కే ఔటయ్యారు. యంగ్‌, డెలానీ విజంభణతో పర్గాత్‌ సింగ్‌(18), దిల్‌ప్రిత్‌ బజ్వా(7)లు డగౌట్‌ చేరారు. పది ఓవర్లలోపే 53 పరుగులకే వికెట్లు పడిన జట్టును శ్రేయాస్‌ మొవ్వ(37), నికోలస్‌ కిర్‌స్టన్‌(49)లు ఆదుకున్నారు. చకచకా సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ స్కోర్‌ బోర్డును కదిలించారు. కాస్త కుదురుకున్నాక ఇద్దరూ బౌండరీలతో చెలరేగారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 75 జత చేయడంతో కెనడా పోరాడగలిగే స్కోర్‌ చేసింది.
అనంతరం కెనడా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. టాపార్డర్‌ బ్యాటర్లు విఫలమవ్వడంతో ఆ జట్టు 59పరుగులకే 6వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత డోక్రెల్‌(30నాటౌట్‌), అడైర్‌(34) రాణించినా.. మ్యాచ్‌ను గెలిపించలేకపోయారు. దీంతో ఐర్లాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7వికెట్లు కోల్పోయి 125పరుగులే చేసింది. కెనడా బౌలర్లు జోర్డాన్‌, హైగర్‌కు రెండేసి, జొనార్డ్‌, సాద్‌ బిన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ నికోలస్‌ కిర్టన్‌కు లభించింది.

స్కోరుబోర్డు (సంక్షిప్తంగా..)
కెనడా : 137/7(20ఓవర్లలో)
నికోలస్‌ కిర్టన్‌ 49, మొవ్వ 37; కర్ట్లీ(2/24), యంగ్‌(2/32)
ఐర్లాండ్‌ : 125/7(20 ఓవర్లలో)
అడైర్‌ 34, డాక్రెల్‌(30నాటౌట్‌); గోర్డన్‌(2/16), హైలిజైర్‌ (2/18)

➡️