మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడిన టీమిండియా
టీమిండియాపై ప్రశంసల జల్లు
రెండో ఐసిసి ట్రోఫీతో రోహిత్ రికార్డు
దుబాయ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ముగించింది. టోర్నీ ఆరంభం నుంచి ఓటమి ఎరుగని రోహిత్ సేన ఫైనల్లోనూ అదే జోరును ప్రదర్శించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50ఓవర్లలో 251పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని టీమిండియా 49ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ(76) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కి తోడు శుభ్‌మన్(31), శ్రేయస్(48), అక్షర్(29), కేఎల్ రాహుల్(34నాటౌట్), హార్దిక్(18) టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం లభించింది. తొలి వికెట్‌కు యంగ్, రచిన్ రవీంద్ర అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనర్ విల్ యంగ్(15) వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్‌బి కావడంతో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర బౌల్డ్ కావడంతో ఓపెనర్లు ఇద్దరూ ఔటయ్యారు. వన్‌డౌన్ బ్యాటర్‌గా వచ్చిన కేన్ విలియమ్సన్ క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే రిటర్న్ క్యాచ్ ఇచ్చి కేన్ విలియమ్సన్ పెవిలియన్ దారి పట్టాడు. అప్పటికి కివీస్ మూడు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్ కీపర్ టామ్ లాథమ్‌ను రవీంద్ర జడేజా ఎల్‌బీడబ్య్లూ చేయడంతో 108 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో డెరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ నెమ్మదిగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచేందుకు ప్రయత్నించారు. ఐదో వికెట్ భాగస్వామ్యానికి 50 పరుగులు జత చేసిన తర్వాత గ్లెన్ ఫిలిప్స్ .. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డయి పెవిలియన్ బాట పట్టాడు. గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి డెరిల్ మిచెల్ వడివడిగా ఆడుతూ దూసుకెళ్లారు. డెరిల్ మిచెల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత దూకుడుగా స్కోర్ పెంచడానికి ప్రయత్నించాడు. షమీ బౌలింగ్‌లో కవర్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి 63 పరుగుల వద్ద డెరిల్ మిచెల్ పెవిలియన్ దారిపట్టాడు. ఫిలిప్స్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్ బ్రేస్‌వెల్ దూకుడుగా ఆడుతూ 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ శాంత్నర్‌ను కోహ్లీ, కేఎల్ రాహుల్ రనౌట్ చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది.
రోహిత్ రికార్డు…
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు పుటల్లోకెక్కాడు. గత ఏడాది టి20 ప్రపంచకప్‌ను అందించిన రోహిత్.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 83బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్ల సాయంతో 78పరుగులు చేసి ఈ ఏడాది ఆరంభంలోనే టీమిండియాకు రెండో ఐసిసి ట్రోఫీని అందించాడు.
స్కోర్‌బోర్డు…
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (ఎల్‌బి)వరుణ్ చక్రవర్తి 15, రచిన్ రవీంద్ర (బి)కుల్దీప్ 37, విలియమ్సన్ (సి అండ్ బి)కుల్దీప్ 11, మిఛెల్ (సి)రోహిత్ (బి)షమీ 63, లాథమ్ (ఎల్‌బి)జడేజా 14, ఫిలిప్స్ (బి)వరుణ్ చక్రవర్తి 34, బ్రాస్‌వెల్ (నాటౌట్) 53, సాంట్నర్ (రనౌట్)కోహ్లి/రాహుల్ 8, స్మిత్ (నాటౌట్) 0, అదనం 16. (50ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 251పరుగులు. వికెట్ల పతనం: 1/57, 2/69, 3/75, 4/108, 5/165, 6/211, 7/239 బౌలింగ్: షమీ 9-0-74-1, హార్దిక్ పాండ్యా 3-0-30-0, వరుణ్ చక్రవర్తి 10-0-45-2, కుల్దీప్ 10-0-40-2, అక్షర్ పటేల్ 8-0-29-0, జడేజా 10-0-30-1.
ఇండియా ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (స్టంప్)లాథమ్ (బి)రచిన్ రవీంద్ర 76, శుభ్‌మన్ (సి)ఫిలిప్స్ (బి)సాంట్నర్ 31, కోహ్లి (ఎల్‌బి)బ్రాస్‌వెల్ 1, శ్రేయస్ (సి)రచిన్ రవీంద్ర (బి)సాంట్నర్ 48, అక్షర్ పటేల్ (సి)రూర్కే (బి)బ్రాస్‌వెల్ 29, కెఎల్ రాహుల్ (నాటౌట్) 34, హార్దిక్ పాండ్యా (సి అండ్ బి)జేమీసన్ 18, జడేజా (నాటౌట్) 9, అదనం 8. (49ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 254పరుగులు. వికెట్ల పతనం: 1/105, 2/106, 3/122, 4/183, 5/203, 6/241 బౌలింగ్: జామిసన్ 5-0-24-1, రూర్కే 7-0-56-0, స్మిత్ 2-0-22-0, సాంట్నర్ 10-0-46-2, రచిన్ రవీంద్ర 10-1-47-1, బ్రాస్‌వెల్ 10-1-28-2, ఫిలిప్స్ 5-0-31-0.
అభినందనల వెల్లువ
ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విటర్(ఎక్స్)లో ‘ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని మూడు సార్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. టీమిండియాకు శుభాకాంక్షలు’ అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘అసాధారణ మ్యాచ్.. అపూర్వ విజయం’ అంటూ పేర్కొనగా.. ‘స్మాషింగ్ విక్టరీ’.. భారత జట్టులోని ప్రతి ఒక్కరూ కోట్లాది మంది హృదయాలను గర్వంతో ఉప్పొంగేలా చేశారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చరిత్ర సృష్టించిన విజయమిది, దేశం గర్వపడేలా చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా దేశాన్ని గర్వపడేలా చేసిన భారత క్రికెట్ జట్టు కృషి, అంకితభావాన్ని కొనియాడుతూ అభినందనలు తెలిపారు. సిరీస్ అంతటా అసాధారణ ప్రతిభను టీమ్ ఇండియా ప్రదర్శించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌పై భారత జట్టు విజయం దేశం గర్వించదగ్గ విషయమన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ విజయంలో స్పిన్నర్లది కీలకపాత్రగా పేర్కొన్నారు. మూడవ సారి ఛాంపియన్స్ ట్రోపి గెలిచిన భారత జట్టుకు అభినందనలు తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించిందని పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
టీమిండియా : రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికె), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ మరియు వరుణ్ చకరవర్తి.
న్యూజిలాండ్ : విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ (వికె) డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (సి), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్