ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫార్మాట్‌లో మార్పులు?

Dec 13,2024 00:45 #Champions Trophy, #Changes, #Cricket

లాహోర్‌: పాకిస్తాన్‌ వేదికగా జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఇంకా అనిశ్చితి వీడలేదు. పాకిస్తాన్‌కు వెళ్లేందుకు బిసిసిఐ విముఖత చూపుతుండగా.. టోర్నీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించే విషయంపై పాకిస్తాన్‌ క్రికెట్‌బోర్డు(పిసిబి) పట్టు వీడటం లేదు. దీంతో షెడ్యూల్‌ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. టోర్నీ ఫిబ్రవరి 19-మార్చి 9 మధ్య జరగాల్సి ఉండగా.. ఇంకా 75 రోజుల కంటే తక్కువ సమయమే ఉంది. ఈ నేపథ్యంలోనే షెడ్యూల్‌ తొందరగా విడుదల చేయాలని అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి)పై ఒత్తిడి పెరుగుతోంది. షెడ్యూల్‌ ప్రకటన మరింత ఆలస్యమైతే టోర్నీలో భారీ మార్పు జరిగే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం. ఛాంపియన్స్‌ ట్రోఫీని 50 ఓవర్ల ఫార్మాట్‌లో కాకుండా టి20 ఫార్మాట్‌లో నిర్వహించాలని బ్రాడ్‌కాస్టర్స్‌, కొంతమంది వాటాదారులు ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. ‘ప్రతిష్టంభన కొనసాగితే ఛాంపియన్స్‌ ట్రోఫీని టీ20 ఫార్మాట్‌గా మార్చాలని కొంతమంది వాటాదారులు కోరే అవకాశం ఉంది. వన్డేలకు రానురాను ఆదరణ తగ్గిపోతుండటంతో టోర్నమెంట్‌ను టీ20 ఫార్మాట్‌గా మార్చితే సులభంగా, వేగంగా మార్కెటింగ్‌ చేసుకోవచ్చు” అని వారి వాదన.

➡️