ముగిసిన జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలు

  • విజేతలుగా తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన జట్లు
  • అతిధుల చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీలు అందజేత

ప్రజాశక్తి – నంద్యాల : నంద్యాల జిల్లా కేంద్రంగా ప్రారంభమైన 42వ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. పట్టణంలోని శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం క్రీడా మైదానంలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలు ముగిశాయి. పోటీలను శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థలు, శ్రీ రామకృష్ణ కళాశాలలు సంయుక్తంగా నిర్వహించగా ముగింపు పోటీలకు శ్రీ రామకృష్ణ కళాశాలల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల అధినేత డాక్టర్ పి. దస్తగిరి రెడ్డి, నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, జాతీయస్థాయి సాఫ్ట్బాల్ సెక్రెటరీ మౌర్య, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ నాగేంద్ర, కర్నూలు జిల్లా సాఫ్ట్బాల్ సెక్రెటరీ విజయకుమార్ తోపాటు శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ పి షేక్షావల్లి రెడ్డి, 23 రాష్ట్రాల నుండి పాల్గొన్న ఆయా టీమ్ల సెక్రటరీలు బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్న ప్రతిసారి తమ నైపుణ్యాలను పెంచుకోవాలని తెలిపారు. క్రీడలకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ జి రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో నే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. క్రీడలతోనే మానసిక ధైర్యం,మేధాశక్తి పెరుగుతాయని చెప్పారు. యుగంధర్ బాబు మాట్లాడుతూ క్రీడ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రాయితీ ఉంటుందని చెప్పారు. ప్రధానంగా పోలీస్ శాఖలో మెరుగైన అవకాశాలు ఉంటాయని గుర్తు చేశారు. అనంతరం జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అతిథులు బహుమతులను పంపిణీ చేశారు. సాఫ్ట్బాల్ బాలుర విభాగంలో జాతీయ స్థాయి ప్రథమ స్థానంలో మహారాష్ట్ర నిలువగా, రాజస్థాన్ ద్వితీయ స్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో విజేతలుగా నిలిచాయి. అలాగే బాలికల విభాగంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలోనూ, పంజాబ్ ద్వితీయ స్థానంలోనూ, మధ్యప్రదేశ్ తృతీయ స్థానంలో నిలిచాయి.

➡️