ఇండియా రెండో ఇన్నింగ్స్ 193పరుగులు
పంత్ అర్ధసెంచరీ
శ్రీలంక లక్ష్యం 372, ప్రస్తుతం 84/4
గాలే: తొలి టెస్ట్‌లో టీమిండియా గెలుపుకు చేరువైంది. చివరిరోజు ఆద్భుతం జరిగితే మినహా.. భారతజట్టు విజయం లాంఛనమే కానుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యత సంపాదించిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 193పరుగులకే ఆలౌటైంది. కానీ నాల్గోరోజు ఆట ముగిసేసరికి శ్రీలంక జట్టు టాపార్డర్ 4 వికెట్లు పడగొట్టి విజయానికి దారి సుగమం చేసుకుంది. ఐదో రోజు మరో ఆరు వికెట్లు తీస్తే చాలు బోణీ టీమిండియాదే. తొలి మూడు రోజులు గాలే స్టేడియంలో అదరగొట్టిన భారత జట్టు నాలుగో రోజు బ్యాటింగ్‌లో తడబడింది. తొలి సెషన్ నుంచి శ్రీలంక పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శుభారంభం దక్కలేదు. ఓపెనర్ యశస్వీ(0)ని అసితా ఫెర్నాండో డకౌట్ చేయగా, కేఎల్ రాహుల్(35)ను ప్రభాత్ జయసూర్యలు ఔట్ చేసి లంకకు బ్రేకిచ్చారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(8) సైతం నిరాశపరచగా.. 81 పరుగుల వద్దే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(7) కూడా విఫలం కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో మెరిసిన దేవ్‌దత్ పడిక్కల్(44)కి తోడు రిషభ్ పంత్(66) ధనా ధన్ బ్యాటింగ్‌లో విజృంభించారు. ఎడాపెడా బౌండరీలు బాదిన పంత్.. మెరుపు అర్ధ శతకంతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో టెస్టుల్లో 21వ అర్ధ సెంచరీతో మెరిసాడు. చివరకు పంత్‌ను లహిరు కుమార వెనక్కి పంపాడు. టెయిలెండర్లను లంక బౌలర్లు చకచకా ఔట్ చేశారు. పంత్ ఔటైన 19 పరుగులకే టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఆతిథ్య జట్టుకు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక బౌలర్లు ఫెర్నాండోకు నాలుగు, జయసూరియకు మూడు, లాహరికు కుమారకు రెండు వికెట్లు దక్కాయి.
టీ బ్రేక్ అనంతరం 372 పరుగుల ఛేదనలో లంకను ఆదిలోనే దెబ్బతీశాడు సిరాజ్. ఓపెనర్ నిషాన్ మధుష్క(6)ను అతడు ఔట్ చేసి బ్రేకివ్వగా.. ఆపై మానవ్ సుతార్(2/30) తిప్పేశాడు. లహిరు ఉడార(16)ను, దినేశ్ చండీమాల్ స్థానంలో ఆడుతున్న పసిందు సూర్యబండార(0)లను వెనక్కి పంపి లంకను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. ప్రసిధ్ కృష్ణ ఓవర్లో కమిందు మెండిస్(2)ను ఔటవ్వడంతో శ్రీలంక కష్టాల్లో పడింది. కెప్టెన్ ధనంజయ డిసిల్వా(31 నాటౌట్), సొనాల్ దినుశా(25 నాటౌట్)లు క్రీజ్‌లో ఉన్నారు. సిరీస్‌లో బోణీ కొట్టేందుకు ఐదోరోజు శ్రీలంక 288 పరుగులు చేయాల్సి ఉండగా.. టీమిండియా 6 వికెట్లు కూల్చితే గెలుపు ఖాయం.
స్కోర్‌బోర్డు...
ఇండియా : 462, 193,
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 284
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: మధుశంక (సి)ప్రసిధ్ (బి)సిరాజ్ 6, ఉదాన (సి)జురెల్ (బి)మానవ్ సుతార్ 16, సూర్యభండార (ఎల్‌బి)మానవ్ సుతార్ 0, కమిందు మెండీస్ (సి)కెఎల్ రాహుల్ (బి)ప్రసిధ్ 2, ధనుంజయ (బ్యాటింగ్) 31, దినుషా (బ్యాటింగ్) 25, అదనం 4. (34 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 84పరుగులు.
వికెట్ల పతనం: 1/13, 2/14, 3/21, 4/47
బౌలింగ్: సిరాజ్ 5-1-11-1, మానవ్ సుతార్ 11-0-30-2, ప్రసిద్ కృష్ణ 8-2-13-1, జడేజా 6-0-16-0, కుల్దీప్ 3-0-8-0, పడిక్కల్ 1-0-5-0.







కామెంట్‌లు (0)