ఎటిపి ఫైనల్స్‌కు జకోవిచ్‌ దూరం

Nov 5,2024 21:18 #Djokovic, #Sports, #Tennis

టూరిన్‌(ఇటలీ): ఎటిపి ఫైనల్స్‌కు స్టార్‌ ఆటగాళ్లకు దూరమవుతున్నారు. నవంబర్‌ 10 నుంచి ఇటలీలోని టురిన్‌ వేదికగా జరిగే ఈ టోర్నీకి ఇప్పటికే పలువురు స్టార్లు దూరం కాగా.. తాజాగా మాజీ చాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని జకోవిచ్‌ టోర్నీ నుంచి వైదొలిగాడు. 2023లో ఏటీపీ ఫైనల్స్‌ చాంపియన్‌ అయిన జకో చివరగా షాంఘై మాస్టర్స్‌లో ఆడాడు. ఆ టోర్నీ ఫైనల్లో ఇటలీ కెరటం జన్నిక్‌ సిన్నర్‌ చేతిలో ఓడిన అతడు మళ్లీ రాకెట్‌ పట్టలేదు. ప్రతిష్ఠాత్మక ఏటీపీ ఫైనల్స్‌కు దూరమవ్వడం తనకు ఎంతో బాధగా ఉందని జకోవిచ్‌ అన్నాడు. తన కోసం ఎదురుచూసే అభిమానులకు సారీ చెబుతూ టెన్నిస్‌ లెజెండ్‌ ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టాడు. ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో జకోవిచ్‌ మోకాలి కండరాల గాయంతో బాధ పడ్డాడు. ఆ గాయం మళ్లీ తిరగబెట్టడంతో అతడు ఏటీపీ ఫైనల్స్‌ ఆడకూడదనే నిర్ణయానికి వచ్చాడు.

➡️