2022లో నాపై విషప్రయోగం జరిగింది : జకోవిచ్‌

మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ స్టార్‌ నోవాక్‌ జకోవిచ్‌ సంచలన ఆరోపణ చేశాడు. 2022లో తనపై విషప్రయోగం జరిగినట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2025 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి ముందు జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ జకో ఈ వ్యాఖ్యలు చేశాడు. 2022లో మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్‌లో తనకు విషపూరిత ఆహారం ఇచ్చినట్లు, సీసం, పాదరసం కలిసి ఉన్న ఆహారాన్ని ఇచ్చినట్లు తెలిపాడు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోని కారణంగా.. ఆ ఏడాది ఆస్ట్రేలియా నుంచి తాను వైదొలగాల్సి వచ్చిందని, అలాగే వీసాను రద్దు చేసి ఆ టోర్నీ ఆడకుండా వెనక్కి పంపించేశారంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన జకోవిచ్‌.. ఈ ఏడాది జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొంటున్నాడు. ఆదివారం నుంచి ఆ టోర్నీ జరగనుంది. 11వ సారి అతను ఈ టోర్నీలో పాల్గొంటున్నాడు. 2022 ఆస్ట్రేలియా వివాదం తన కెరీర్‌ను ఇబ్బంది పెట్టినా.. ఆస్ట్రేలియా ప్రజల పట్ల తనకు ఎటువంటి ద్వేషభావం లేదన్నాడు. తానేమీ వ్యాక్సిన్‌ను అనుకూలం, వ్యతిరేకం కూడా కాదని, కానీ శరీరానికి తగినట్లుగా వాటిని తీసుకునే హక్కు తనకు ఉందని, ఆ అంశంలో మరొకరి ప్రోద్భలం అవసరం లేదని తెలిపాడు.

➡️