ముంబయి: టీమిండియా పేసర్ హర్షీత్ రాణా అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం పలు వివాదాలకు తెరలేపే విధంగా జరిగింది. ఇంగ్లండ్‌తో శుక్రవారం నాల్గో టి20లో శివమ్ దూబే స్థానంలో ప్రత్యామ్నాయంగా ‘కంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్’గా హర్షీత్ రాణా మైదానంలోకి వచ్చాడు. పేసర్ అయిన హర్షీత్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కీలకమైన మూడు వికెట్లు తీసి టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు. బ్యాటర్ స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా బౌలర్ మైదానంలోకి దిగడం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడం పలు విమర్శలకు దారితీసింది. మ్యాచ్ అనంతరం హర్షీత్ మాట్లాడుతూ.. దూబేకు ప్రత్యామ్నాయంగా రెండు ఓవర్ల తర్వాత కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి దిగాల్సి ఉంటుందని మాత్రమే తనకు తెలియజేయబడిందని చెప్పుకొచ్చాడు.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
క్రికెట్‌లో సబ్‌స్టిట్యూట్ విధానం ఎప్పటినుంచో అమలులో ఉంది. ఎవరైనా ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో ఫీల్డింగ్ చేసేందుకు మాత్రమే ఛాన్స్ ఉండేది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం లాంటి ఉదంతాలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఐసిసి కంకషన్ రూల్‌ను తీసుకొచ్చింది. బ్యాటర్ హెల్మెట్, తల, మెడ భాగంలో బంతి తాకినప్పుడు తప్పనిసరిగా ఫిజియోలు వచ్చి పరిశీలించాలి. కంకషన్ గాయానికి గురైన ప్లేయర్ ఆడలేని పరిస్థితి ఉంటే సబ్‌స్టిట్యూట్‌గా మరొకరిని తుది జట్టులోకి తీసుకునే వెసులుబాటు కల్పించింది. అప్పటికే సదరు కంకషన్‌కు గురైన ప్లేయర్ బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసి ఉన్నా సరే కొత్తగా వచ్చే ఆటగాడు మొదటినుంచి మళ్లీ మొదలుపెట్టే వెసులుబాటు దక్కుతుంది. కానీ, కంకషన్‌కు గురైన సమయంలో సదరు బౌలర్‌పై నిషేధం ఉంటే మాత్రం కొత్తగా వచ్చేవారు బౌలింగ్ చేయడానికి అనర్హులు. ఈ రూల్‌ను పలు జట్లు ఇప్పటికీ వినియోగించుకుంటున్నాయి.
ఐసిసి కంకషన్ రూల్..
ఐసిసి టి20 కంకషన్ నియమం 1.2.7 ప్రకారం ప్రత్యామ్నాయ ఆటగాడిని మైదానంలోకి దించే అధికారం ఉంది. నిబంధనల ప్రకారం మ్యాచ్ రిఫరీ కంకషన్ రీప్లేస్‌మెంట్‌కు ఆమోదం తెలపాలి. ఐసిసి రూల్ 1.2.7.4 మరియు 1.2.7.5 ప్రకారం గాయపడ్డ ఆటగాడు బ్యాటర్ అయితే బ్యాటర్.. రెగ్యులర్ బౌలర్ అయితే రెగ్యులర్ బౌలర్‌ను మాత్రమే మైదానంలోకి అనుమతించాల్సి ఉంది. భారత్-ఇంగ్లండ్ టి20 మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్.. గాయపడ్డ బ్యాటర్ దూబే స్థానంలో బౌలర్‌క హర్షీత్ రాణాకు ఎలా అనుమతించారని అందరి వాదన. ‘లైక్-ఫర్-లైక్-రీప్లేస్‌మెంట్’ అనే పదాన్ని శ్రీనాథ్ సూచించినట్లు మరికొందరి వాదన.
ఇదేమీ కొత్త కాదు..
భారత్ కంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్‌ను వాడుకోవడం ఇదేమీ కొత్త కాదు. 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో స్పిన్నర్ చాహల్‌ను కంకషన్ సబ్‌స్టిట్యూషన్‌గా భారత్ బరిలోకి దించింది. ఆ మ్యాచ్‌లో చాహల్ మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అప్పుడు కూడా జడేజా స్పిన్ ఆల్‌రౌండర్ కాగా.. చాహల్ స్పెషలిస్ట్ స్పిన్నర్. జడ్డూకు బదులు చాహల్ వచ్చి మ్యాచ్‌ను గెలిపించాడు. కానీ, హర్షీత్ మాత్రం ఇలా అరంగేట్రం చేయడమే విశేషం.
ఇక ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ మాత్రం ఇలా కంకషన్ సబ్‌గా వచ్చి జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడు. 2019 యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టులో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ తలకు బంతి తాకడంతో బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఆ పరిస్థితుల్లో వచ్చిన లబుషేన్ 59 పరుగులు చేసి జట్టును ఓటమి నుంచి తప్పించాడు. అప్పటికి లబుషేన్ పూర్తిస్థాయి బ్యాటర్ కాకపోవడం గమనార్హం. ఇప్పుడు మిడిలార్డర్‌లో అత్యంత కీలకంగా మారిపోయాడు.
ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి పాకిస్తాన్ ఈ కంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్‌ను వినియోగించుకుంది. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్‌లో పాక్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌ను రనౌట్ చేసే క్రమంలో తలకు గాయమైంది. అతడికి బదులు ఉసామా మిర్‌ను కంకషన్‌గా తీసుకుంది. తన తొలి ఓవర్‌లోనే దక్షిణాఫ్రికా బ్యాటర్ వాన్‌డర్‌ను ఎల్బీ చేశాడు. షాదాబ్, మిర్ ఇద్దరూ లెగ్ బ్రేక్ స్పిన్నర్లే.
భారత్ తరఫున తొలి అరంగేట్రం..
అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఏడుగురు ఆటగాళ్లు కంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్‌తో అరంగేట్రం చేశారు. వీరిలో హర్షిత్ భారత్ తరఫున తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టి20లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. శివమ్ దూబె హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ, ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో ఓవర్టన్ వేసిన బంతి దూబె హెల్మెట్‌ను తాకింది. దీంతో అతడి స్థానంలో రాణాకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అవకాశం దక్కింది. ఐసీసీ రూల్ ప్రకారం కంకషన్ సబ్‌స్టిట్యూషన్‌పై మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయం. ఈ నిర్ణయంపై అప్పీల్ చేసే హక్కూ ప్రత్యర్థి జట్టుకు ఉండదు.
దూబెకు తలనొప్పి లక్షణాలు: మోర్నీ మోర్కెల్
శివమ్ దూబె స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన హర్షీత్ రాణా బౌలింగ్‌పై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వివరణ ఇచ్చాడు. శివమ్ దూబె బ్యాటింగ్ చేసే సమయంలో హెల్మెట్‌కు బంతి బలంగా తాకింది. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో కాస్త తలనొప్పి లక్షణాలు మొదలైనట్లు తెలిపాడు. దీంతో అతడికి బదులు మరొకరి పేరును మ్యాచ్ రిఫరీకి తెలియజేశాం. సరైన సబ్‌స్టిట్యూట్ పేరును ఇచ్చాం. ఆ తర్వాత రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. ఎవరిని ఆడించే అధికారం మాకు లేదు. మేం కేవలం పేరు ఇవ్వడం వరకే. ఆ తర్వాత మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. అది మా చేతుల్లో ఉండదు. రిఫరీ నుంచి అనుమతి రావడంతోనే ఆ ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నాం” అని మోర్కెల్ తెలిపాడు.