ఆంధ్రా రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ రాజగోపాల్‌ యాచేంద్ర కన్నుమూత

ప్రజాశక్తి – మధురవాడ (విశాఖపట్నం) : ఆంధ్రా రంజీ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ వెలుగోటి రాజగోపాల్‌ యాచేంద్ర (93) వయోభారంతో గురువారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో కన్నుమూశారు. ఆయన ఆంధ్రా రంజీ క్రికెట్‌ టీమ్‌లో 1956 నుంచి 1965 మధ్య 15 రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో ఆడారు. బ్యాటింగ్‌, లెగ్‌ బ్రేక్‌ బౌలింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. 1963 నుంచి 1965 వరకు ఆంధ్ర జట్టుకు నాయకత్వం వహించారు. ఎంతో మంది క్రీడాకారులకు ఆయన ఆదర్శంగా నిలిచారు. టేబుల్‌ టెన్నిస్‌లోనూ మంచి క్రీడాకారునిగా ఆయనకు పేరుంది. ఆయన మృతిపై ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, ఎంపి కేశినేని శివనాథ్‌ (చిన్ని), ఎసిఎ కార్యదర్శి, రాజ్యసభ ఎంపి సానా సతీష్‌ బాబు సంతాపం తెలిపారు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్‌ రంగంలో తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

➡️