క్రీడలు : ”డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతాయ్” అని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అతడు ఎవరి గురించి ఈ వ్యాఖ్యలు చేశారా ? అంటూ … నెటిజన్లలో గందరగోళం ఏర్పడింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో సరైన ప్రదర్శన చేయలేక విఫలమైన టీమిండియా సీనియర్ ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో … దీనిపై ఇటీవల మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించారు. టీమిండియా సూపర్‌స్టార్ సంస్కృతిని వీడాలని అతడు చేసిన సూచన చర్చకు దారితీసింది. ఈనేపథ్యంలోనే తాజాగా అతడు మరో పోస్ట్ చేశారు. ”మార్కెట్లో ఏనుగు నడిచివెళుతుంటే …. డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి” అని పోస్టు పెట్టారు. ప్రస్తుతం భజ్జీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఎవరిని ఉద్దేశించి అతడు ఈ పోస్ట్ పెట్టారా ? అని నెటిజన్లు గందరగోళానికి గురవుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, కాస్త మాటలు అదుపులో పెట్టుకోవాలని మరికొందరు క్రికెట్ అభిమానులు హర్భజన్‌కు సూచిస్తున్నారు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌పై ఈ మాజీ క్రికెటర్ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్‌లో విశ్లేషించిన సంగతి తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ టీమిండియా కోచ్‌గా ఉన్నంతకాలం అంతా బాగుందని, ఈ ఆరు నెలల్లో ఏమైంది ? అని ప్రశ్నించారు. ఇక, ఆసీస్ పర్యటనలో విఫలమైన సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లపై భజ్జీ స్పందిస్తూ.. ”ప్రతి ఆటగాడికి ఎంతో కొంత పాపులారిటీ, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అయితే, ఆట కంటే ఏదీ ముఖ్యం కాదు. కపిల్‌దేవ్, అనిల్ కుంబ్లే లాంటి పెద్ద పెద్ద మ్యాచ్ విన్నర్లు కూడా జట్టు నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని అప్పట్లోనే బీసీసీఐ, సెలక్టర్లు చెప్పారు. టీమిండియా సూపర్‌స్టార్ సంస్కఅతిని వదిలిపెట్టాలి. అభిమన్యు ఈశ్వరన్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేసి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. సర్ఫరాజ్ ఖాన్ పరిస్థితి అంతే. పేరున్న ఆటగాళ్లని కాకుండా బాగా ఆడే ప్లేయర్లనే ఎంపిక చేయాలి” అని హర్భజన్ సూచించారు.
Post – ”డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి” : మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/sports-2.jpg)