భారత మాజీ క్రికెటర్‌ సయ్యద్‌ అబిద్‌ అలీ కన్నుమూత

హైదరాబాద్‌: భారత మాజీ క్రికెటర్‌ సయ్యద్‌ అబిద్‌ అలీ(83) బుధవారం కన్నుమూశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో తుదిశ్వాస విడిచారు. 1971లో ఓవల్‌లో జరిగిన చారిత్రాత్మక టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచిన భారత జట్టులో అబిద్‌ అలీ ఓ ఆటగాడు. ఆల్‌రౌండర్‌ అయిన అబిద్‌ అలీ భారత్‌ తరఫున 29టెస్టుల్లో 47 వికెట్లు పడగొట్టారు. అత్యుత్తమ ఫీల్డర్లలోనూ ఒకరిగా గుర్తింపు పొందారు. 1980లో కాలిఫోర్నియాకు వెళ్లే ముందు అబిద్‌ కొన్నేళ్లపాటు హైదరాబాద్‌ జూనియర్‌ జట్టుకు శిక్షణ ఇచ్చారు. 1990 చివరలో మాల్దీవులకు, 2001-02లో రంజీ ట్రోఫీలో సౌత్‌ జోన్‌ లీగ్‌ గెలిచిన ఆంధ్రా జట్టుకు, 2002-2005 మధ్యకాలంలో యుఎఇ జట్టుకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో నివాసం ఉంటూ.. స్టాన్‌ఫోర్డ్‌ క్రికెట్‌ అకాడమీలో యువకులకు శిక్షణ ఇస్తున్నారు. అబిద్‌ అలీ మృతికి భారత క్రికెటర్లతోపాటు విదేశీ క్రికెటర్లు కూడా సంతాపం ప్రకటించారు. ఆయన క్రికెట్‌కు చేసిన సేవలను కొనియాడుతూ.. యువ ఆటగాళ్లకు మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు.

➡️