జావెలిన్‌ త్రోయర్‌ డిపి మనుపై నాలుగేళ్ల నిషేధం

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల రజత పతక విజేత జావెలిన్‌ త్రోయర్‌ డిపి మనుపై జాతీయ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మను నిషేధిత మిథైల్‌ టెస్టోస్టెరాన్‌ తీసుకున్నట్లు తేలిపింది. గత ఏడాది ఏప్రిల్‌లో బెంగళూరులో జరిగిన ఇండియన్‌ జిపి అథ్లెటిక్స్‌ మీట్‌ సందర్భంగా సేకరించిన నమూనాల్లో మను ఈ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. ఆ నమూనాల్లో అనాబాలిక్‌-ఆండ్రోజెనిక్‌ స్టెరాయిడ్‌ ఉన్నట్లు కనిపించడంతో అతనిపై నాడా తొలుత తాత్కాలిక నిషేధం విధించింది. నిరోధిత క్రమశిక్షణా ప్యానెల్‌(ఎడిడిపి) తీర్పు అనంతరం నాడా నిషేధం విధించింది. దీంతో అతడు 2024 జూన్‌ నుంచి నాలుగేళ్లపాటు ఎలాంటి క్రీడల్లో పాల్గొనేందుకు అవకాశం లేదు. ఆ మీట్‌లో డిపి మను జావెలిన్‌ను 81.91మీ. విసిరి టైటిల్‌ విజేతగా నిలిచాడు.

➡️