French Open : టైటిల్‌ విజేత స్వైటెక్‌

  • ఫైనల్లో పౌలినీపై సునాయాస విజయం

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను పోలండ్‌కు చెందిన టాప్‌సీడ్‌ ఇగా స్వైటెక్‌ చేజిక్కించుకుంది. రొలాండ్‌ గారోస్‌లో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో స్వైటెక్‌ వరుససెట్లలో 28ఏళ్ల ఇటలీకి చెందిన 12వ సీడ్‌ పౌలినీపై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. వరుసగా మూడో ఏడాదీ ఈ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోవడంతోపాటు కెరీర్‌లో నాల్గో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను చేజిక్కించుకొని మార్టీనా నవ్రతిలోవా, క్రిస్‌ ఎవర్ట్‌ సరసన నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో స్వైటెక్‌ 6-2, 6-1తో ఫౌలినిని చిత్తుచేసింది. టైటిల్‌ను చేజిక్కించుకొనే క్రమంలో స్వైటెక్‌ ప్రత్యర్ధికి కేవలం మూడు పాయింట్లు మాత్రమే ఇచ్చింది. 28ఏళ్ల పౌలినీ 23ఏళ్ల స్వైటెక్‌ జోరు ముందు నిలువలేకపోయింది. మూడుసార్లు ఈ టైటిల్‌ గతంలో సెరెనా విలియమ్స్‌(2002, 2013, 2015) కూడా చేజిక్కించుకుంది. స్వైటెక్‌ కెరీర్‌లో ఇది నాల్గో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కాగా.. యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను 2022లో చేజిక్కించుకొంది. స్వైటెక్‌ 2020, 2022, 2023, 2024లలో ఈ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. అలాగే ఈ టోర్నమెంట్‌లో స్వైటెక్‌ మొత్తం 20మ్యాచుల్లో 18వరుస విజయాలతో తన రికార్డునూ మెరుగుపరుచుకుంది. స్వైటెక్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్‌ చేరిన ప్రతిసారి ట్రోఫీ గెలిచిన రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ ఐదుసార్లు ఫైనల్‌ చేరిన ఆమె ఐదింటా జయభేరి మోగించి విజేతగా నిలిచింది. ఈ ఏడాది ఆరంభంలో స్వైటెక్‌ యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించింది. అదే జోరును కొనసాగించిన ఆమె మట్టి కోటలో మహారాణిగా ఎదిగింది.

ఆ ఇద్దరు వైదొలగడంతో…
ఫ్రెంచ్‌ ఓపెన్‌లో కఠిన ప్రత్యర్థులు అరినా సబలెంక, కొకొ గాఫ్‌లు సెమీస్‌లోనే వెనుదిరగడం.. స్వైటెక్‌ విజయాన్ని తేలిక చేసింది. టోర్నీ ఆసాంతం సంచలన విజయాలు సాధించిన ఇటలీ సంచలనం జాస్మిన్‌ ఫౌలిని టైటిల్‌ పోరులో తడబడింది. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడిన ఇటలీ అమ్మాయి టాప్‌ సీడ్‌ జోరు ముందు నిలవలేకపోయింది.

రెండో క్రీడాకారిణిగా…
వరుసగా మూడో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన స్వైటెక్‌ మరో రికార్డు నెలకొల్పింది. మహిళల టెన్నిస్‌లో ఈ ఘనత సాధించిన రెండో క్రీడాకారిణిగా ఆమె చరిత్ర లిఖించింది. ఇటీవలి కాలంలో మాజీ వరల్డ్‌ నంబర్‌ జస్టిన్‌ హెనిన్‌, 2005, 2006, 2007లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది.

నేడు పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌..
పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ ఆదివారం జరగనుంది. 3వ సీడ్‌, స్పెయిన్‌ సంచలనం కార్లోస్‌ అల్కరాజ్‌, 4వ సీడ్‌, జర్మనీకి చెందిన ఆండీ జ్వెరేవ్‌ల మధ్య టైటిల్‌పోరు జరగనుంది. శుక్రవారం జరిగిన రెండో సెమీస్‌లో జ్వెరేవ్‌ 2-6, 6-2, 6-4, 6-2తో కాస్పర్‌ రూఢ్‌(డెన్మార్క్‌)పై విజయం సాధించాడు. జ్వెరేవ్‌ తొలిసెట్‌ ఓడినా.. ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లలో పుంజుకొని మ్యాచ్‌ను ముగించాడు.

స్వైటెక్‌ టైటిల్‌ గెలిచింది ఇలా..
ఫైనల్‌ : ఫౌలిని(ఇటలీ)పై 6-2, 6-1(గెలుపు)
సెమీఫైనల్‌ : కోకా గాఫ్‌(అమెరికా)పై 6-2, 6-4(గెలుపు)
క్వార్టర్‌ఫైనల్‌ : వోండ్రుసోవా(చెక్‌)పై 6-0, 6-2(గెలుపు)
ప్రి క్వార్టర్స్‌ : పొటపొవా(రష్యా)పై 6-0, 6-0(గెలుపు)
మూడోరౌండ్‌ : బౌచ్‌కోవా(చెక్‌)పై 6-4, 6-2(గెలుపు)
రెండోరౌండ్‌ : ఒసాకా(జపాన్‌)పై 7-6(7-1), 1-6, 5-7(గెలుపు)
తొలిరౌండ్‌ : జీన్‌జియాన్‌(ఫ్రాన్స్‌)పై 6-1, 6-2(గెలుపు)

➡️