అంతర్జాతీయ క్రికెట్‌కు గప్తిల్‌ గుడ్‌బై

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌ మార్టిన్‌ గప్తిల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం 38ఏళ్ల గప్తిల్‌ 2022 అక్టోబర్‌లో చివరిసారిగా న్యూజిలాండ్‌ తరఫున ఆడాడు. మూడు ఫార్మాట్‌ల్లో కలిపి మొత్తం 367 మ్యాచ్‌లు ఆడాడు. కెరీర్‌లో 23 సెంచరీలు సాధించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ తన సత్తా చాటుకున్నాడు. న్యూజిలాండ్‌ తరఫున టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు గప్తిల్‌ మాత్రమే. 122 టి20ల్లో 31.81సగటుతో 3,531 పరుగులు.. 198 వన్డేల్లో 7,346 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. గప్తిల్‌ కంటే ముందు రాస్‌ టేలర్‌(8,607పరుగులు), స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(8,007) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అరంగేట్రం చేసిన తొలి వన్డేలోనే సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. 47టెస్టుల్లో 29.38సగటుతో కేవలం 2,586పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో 2009 నుంచి 2016 వరకు పేలవఫామ్‌తో టెస్టుల్లో చోటు కోల్పోయాడు. 2009లో వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ, 2015 వన్డే ప్రపంచ కప్‌ క్వార్టర్‌ఫైనల్‌లో వెస్టిండిస్‌పై డబుల్‌ సెంచరీ సాధించాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ కొట్టిన తొలి న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌గా రికార్డులు సృష్టించాడు. టి20లో రెండు సెంచరీలు నమోదు చేశాడు.

➡️