16ఏళ్ల హాకీ కెరీర్‌కు రాణి రాంపాల్‌ గుడ్‌ బై

Oct 25,2024 07:38 #Hockey, #Retirement

ఛండీగడ్‌ : భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌ వీడ్కోలు పలికింది. సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్టు గురువారం రాంపాల్‌ వెల్లడించింది. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆమె తన 16ఏళ్ల కెరీర్‌కు గుడ్‌ బై చెప్పేసింది. ఫార్వర్డ్‌ ప్లేయర్‌ అయిన రాణి సారథిగా భారత హాకీకి వన్నె తెచ్చింది. ఆమె ఏకంగా 254 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ‘భారత జట్టుతో నా ప్రయాణం ఎంతో చిరస్మరణీయం. ఇన్నేళ్లు దేశం తరఫున ఆడతానని ఊహించ లేదు. టీమిండియాకు ఆడాలనే కాంక్షతో అన్ని అడ్డండకులు దాటి నిజం చేసుకున్నా’ అని రాణి మీడియా సమావేశంలో తెలిపింది. హరియాణాకు చెందిన రాణి రాంపాల్‌ 15ఏళ్లకే జాతీయ జట్టుకు ఎంపికైంది. ఫార్వర్డ్‌ ప్లేయర్‌గా తన ముద్ర వేసిన ఆమె అనతికాలంలోనే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. రాణి సారథ్యంలో భారత మహిళల జట్టు అద్భుత విజయాలు సాధించింది. ఆమె కెప్టెన్సీలో 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం.. 2018 ఆసియా గేమ్స్‌లో రజతం సాధించింది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో 4వ స్థానంలో నిలిచింది. 16ఏళ్ల కెరీర్‌లో రాణి 205 గోల్స్‌ కొట్టింది. భారత హాకీకి విశేష సేవలు అందించిన ఆమెకు ప్రభుత్వం 2020లో ప్రతిష్ఠాత్మక ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డుతో గౌరవించింది.

➡️