సిఎంతో చర్చించేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వండి
ఒలింపిక్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌కె పురుషోత్తం
ప్రజాశక్తి – విజయవాడ అర్బన్ : జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగే 38వ జాతీయ క్రీడల్లో పాల్గొనే రాష్ట్ర జట్లకు ప్రభుత్వ సహకారంపై చర్చించేందుకు సిఎం ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఎపిఒఎ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌కె పురుషోత్తం కోరారు. పురుషోత్తం అధ్యక్షతన బుధవారం విజయవాడలో ప్రత్యేక సమావేశం జరిగింది. డెహ్రాడూన్‌లో జరిగే 38వ జాతీయ క్రీడల సన్నాహకాలపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… డిసెంబరు నెలాఖరులోగానీ, జనవరి మొదటి వారంలోగానీ పోటీల్లో పాల్గొనే టీమ్‌లను ఖరారు చేస్తామని చెప్పారు. జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు చెఫ్ డి-మిషన్‌గా ఎపిఒఎ ఉపాధ్యక్షులు బడేటి వెంకట్రామయ్యను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ క్రీడల్లో కోచ్‌లు, మేనేజర్లు, టెక్నికల్ అధికారులతో సహా 220 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర కంటింజెంట్ పాల్గొంటుందని చెప్పారు. జాతీయ క్రీడల్లో రాష్ట్ర జట్ల భాగస్వామ్యానికి సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నేటి వరకు ఒలింపిక్ సంఘంతోగానీ, రాష్ట్ర క్రీడా సంఘాలతోగానీ ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ ఒలింపిక్ సంఘం తమను గుర్తించినప్పటికీ, శాప్ తమతో ఎలాంటి సమావేశాలూ నిర్వహించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో డెహ్రడూన్‌లో జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొనే రాష్ట్ర జట్లకు ప్రభుత్వ సహకారంపై చర్చించేందుకు సిఎం అపాయింట్‌మెంట్ కోరుతున్నట్లు తెలిపారు. ఒలింపిక్ సంఘానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోతే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగో లేకుండానే రాష్ట్ర జట్లు జాతీయ క్రీడల్లో పాల్గొంటాయని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఎపిఒఎ సిఇఒ గోవిందరాజు, ఉపాధ్యక్షుడు నాదెళ్ల బ్రహ్మాజీరావు, సంయుక్త కార్యదర్శి సుబ్బారావు, కోశాధికారి శ్రీనివాస్, మహిళా ప్రతినిధి పద్మజాబాలా పాల్గొన్నారు.
