ట్రోఫీతోపాటు రూ.11.45కోట్లు
మూడు గేమ్‌ల గెలుపుకు రూ.5కోట్లు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రూ.5కోట్లు
చెన్నై: 18ఏళ్లకే ప్రపంచ చెస్ చాంపియన్ టైటిల్‌ను సాధించిన దొమ్మరాజు గుకేశ్‌కు భారీ నజరానాలు దక్కాయి. సింగపూర్ వేదికగా జరిగిన క్లాసికల్ ఫార్మాట్‌లో డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ వరల్డ్ చాంపియన్‌గా అవతరించాడు. లిరెన్‌తో జరిగిన 14 గేమ్‌ల పోరులో గుకేశ్ 7.5-6.5 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. 58ఎత్తుల్లో 32 ఏళ్ల లిరెన్ ఆటకు చెక్ పెట్టి అత్యుత్తమ ప్రదర్శనతో చదరంగ రారాజుగా అవతరించాడు. చెస్ ప్రపంచ చాంపియ న్‌గా నిలిచిన గుకేశ్‌కు ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల (13 లక్షల 50 వేల డాలర్లు) ప్రైజ్‌మనీ లభిం చింది. అంతేకాకుండా మూడు గేమ్‌లు గెలిచినం దుకు అదనంగా రూ.5.07 కోట్లు గుకేశ్‌కు అందాయి.
స్టాలిన్ రూ.5కోట్లు
ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన దొమ్మరాజు గుకేశ్‌కు రూ.5కోట్ల నగదు బహుమతి అందజేయనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. సింగపూర్‌లో జరిగిన వరల్డ్ చెస్ టోర్నీలో.. గుకేశ్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్‌తో ఫోన్‌లో మాట్లాడారు సీఎం స్టాలిన్. వరల్డ్ టైటిల్ సాధించిన గుకేశ్‌ను ఆయన మెచ్చుకున్నారు. డిప్యూటీ సిఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన సూచనను స్వీకరిస్తున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. చెస్ టైటిల్ విజేత గుకేశ్‌కు రూ.5 కోట్ల క్యాష్ ప్రైజ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైందన్నారు.
విశ్వనాథన్ ఆనంద్ శుభాకాంక్షలు
చరిత్రను తిరగరాస్తూ 18ఏళ్ల డి గుకేశ్ సంచలన ప్రదర్శనతో ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు.
ఈ విజయంపై చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ సోషల్ మీడియాలో మరో పోస్టుతో ఆకట్టుకున్నాడు. గుకేశ్ చిన్ననాటి ఫొటోను ఆనంద్ షేర్ చేశాడు. ”ఇప్పుడీ పిల్లాడే కింగ్” అంటూ క్యాప్షన్ జోడించాడు. అండర్-13 పోటీల్లో భాగంగా ఆనంద్ చేతులమీదుగా గుకేశ్ ఐదేళ్ల కిందట ఛాంపియన్ బహుమతిని అందుకొన్నాడు. ఆ ఫొటోనే తాజాగా ఆనంద్ షేర్ చేశాడు.