అత్యుత్తమ ఆటగాళ్ల రేసులో హర్మన్‌ప్రీత్‌, శ్రీజేశ్‌

  • ఎఫ్‌ఐహెచ్‌ అవార్డులకు నామినేట్‌

లాసన్నె: భారత హాకీజట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, మాజీ గోల్‌కీపర్‌ పిఆర్‌ శ్రీజేశ్‌ అత్యుత్తమ ఆటగాళ్లకు నామినేట్‌ అయ్యారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్‌ఐహెచ్‌) పురుషుల ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’లకు ప్రకటించిన జాబితాలో వీరు చోటు దక్కించుకున్నాడు. ఆటగాళ్ల జాబితాలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌కు చోటు దక్కగా.. గోల్‌కీపర్ల కోటాలో పిఆర్‌ శ్రీజేశ్‌కు చోటు దక్కింది. అత్యుత్తమ ఆటగాళ్లకు నామినేట్‌ అయిన వారిలో థర్రీ బ్రింక్‌మన్‌(నెదర్లాండ్స్‌), జో డీ మోల్‌(నెదర్లాండ్స్‌, హానర్స్‌ ముల్లర్‌(జర్మనీ), జచ్‌ వల్లెస్‌(ఇంగ్లండ్‌) కూడా ఉన్నారు. ఇక పిఆర్‌ శ్రీజేశ్‌తోపాటు పిర్మిన్‌ బ్లాక్‌(నెదర్లాండ్స్‌), లూయిస్‌ కాల్జాడో(స్పెయిన్‌), జీన్‌ పాల్‌ డాన్బెర్గ్‌(జర్మనీ), టోమస్‌ శాంటియాగో(అర్జెంటీనా)లనుంచి పోటీ ఉంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీజట్టు కాంస్య పతకం చేజిక్కించుకోవడంలో వీరిద్దరి పాత్ర కీలకమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాంస్య పతక పోటీలో భారత్‌ 2-1గోల్స్‌ తేడాతో స్పెయిన్‌ను చిత్తుచేయడంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, పిఆర్‌ శ్రీజేశ్‌ ముఖ్యపాత్ర పోషించారు. ఇక ఒలింపిక్స్‌లో 10గోల్స్‌ చేసిన ఆటగాడు హర్మన్‌ప్రీత్‌ మాత్రమే. గోల్‌కీపర్‌ పిఆర్‌ శ్రీజేశ్‌ గ్రేట్‌ బ్రిటన్‌తో మ్యాచ్‌ సందర్భంగా అమిత్‌ రోహిదాస్‌ రెడ్‌కార్డుకు గురై 10మందితో ఆటగాళ్లతో ఆడాల్సి వచ్చినా.. భారత గోల్‌పోస్ట్‌ముందు అడ్డుగోడగా నిలిచి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ 4-2గోల్స్‌ తేడాతో షూటౌట్‌లో నెగ్గి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. 2024లో హాకీ టెస్ట్‌ మ్యాచ్‌లు, ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌, హాకీ నేషన్స్‌, ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌, ఒలింపిక్స్‌ గేమ్స్‌ సహా అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌ల డేటానుంచి అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేయడం జరుగుతుంది. అక్టోబర్‌ 11 వరకు ఓటింగ్‌ వేసేందుకు ఆఖరు తేదీ కాగా.. జాతీయ జట్ల కెప్టెన్లు, కోచ్‌లు, జాతీయ సంఘాలు, అధికారులు, అభిమానులు, ఆటగాళ్లు, మీడియా ఓటింగ్‌ వేసేందుకు అర్హులు.

➡️