ఆదుకున్న అభిమన్యు

Oct 3,2024 22:01 #Cricket, #Ranji Trophy, #Sports
  • రెస్టాఫ్‌ ఇండియా 289/4

లక్నో: ఇరానీ ట్రోఫీ రెస్టాఫ్‌ ఇండియా బ్యాటర్‌ అభిమన్యు ఈశ్వరన్‌(151) అజేయ శతకంతో మెరిసాడు. ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 537పరుగుల భారీ స్కోర్‌ను అందుకునే క్రమంలో మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెస్టాఫ్‌ ఇండియా జట్టు 4వికెట్ల నష్టానికి 289పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 9వికెట్ల నష్టానికి 536పరుగులతో గురువారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ముంబయి మరో పరుగు జతచేసి జునైద్‌ ఖాన్‌(0) వికెట్‌ను కోల్పోయింది. ఆ వికెట్‌ను ముఖేష్‌ కుమార్‌ పడగొట్టాడు. రెస్టాఫ్‌ ఇండియా బౌలర్లు ముఖేష్‌ కుమార్‌కు ఐదు, యశ్‌ దయాల్‌, ప్రసిధ్‌ కృష్ణకు రెండేసి, శరణ్‌ జైన్‌కు ఒక వికెట్‌ దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన రెస్టాఫ్‌ ఇండియాకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(9) నిరాశపరిచాడు. పడిక్కల్‌(16) కూడా నిరాశపరిచినా.. అభిమన్యు ఈశ్వరన్‌.. సాయి సుదర్శన్‌(32), ఇషాన్‌ కిషన్‌(38) సహకారంతో అజేయ సెంచరీతో కదం తొక్కాడు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి అభిమన్యు ఈశ్వరన్‌కు తోడు ధృవ్‌ జురెల్‌(30) క్రీజ్‌లో ఉన్నారు. ముంబయి బౌలర్లు మోహిత్‌ అవస్థికి రెండు, జునైద్‌ ఖాన్‌, తనుష్‌ కోటియన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.

➡️