- జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ రిషిధావన్
ప్రజాశక్తి-మధురవాడ (విశాఖపట్నం) : రంజీ ట్రోఫీ మూడో లీగ్ మ్యాచ్‌లోనూ ఆంధ్ర ఆటతీరు మారలేదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హిమాచల్‌ప్రదేశ్ జట్టు చేతిలో ఆంధ్ర జట్టు ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. విశాఖపట్నం పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఎలైట్ గ్రూపు-బిలో హిమాచల్‌ప్రదేశ్ బౌలర్ల ధాటికి ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 118పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండ్ ప్రతిభ చూపిన రిషి ధావన్ (195పరుగులు, 3/80వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 158 ఓవర్లలో 500 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జట్టులో కెప్టెన్ రిషిధావన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 318 బంతుల్లో 19 బౌండరీలు, 2 సిక్సర్ల సహాయంతో 195 పరుగులు చేసి, తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆకాష్ వశిష్ట్ 85, అంకిత్ ఆర్ కల్సీ 53, ముకుల్ నేగి 42 పరుగులు చేశారు. ఆంధ్ర జట్టు బౌలర్లలో కేవీ శశికాంత్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. సత్యనారాయణ రాజు 3, విజరు, మనిష్ చెరో వికెట్ తీసుకున్నారు. ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు చేయడంతో 156 పరుగులు వెనుకబడింది. హిమాచల్‌ప్రదేశ్ బౌలర్లు వినరు గెలిటియా, మయాంక్ దగార్ ధాటికి ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వినరు 5, మయాంక్ దగార్ 4 వికెట్లు తీసుకున్నారు. ఆంధ్ర జట్టులో కెప్టెన్ ఎస్.కె. రషీద్ 34, హనుమ విహారి 20, మనిష్ 23, అశ్విన్ హెబ్బార్ 17 పరుగులు చేశారు.