దుబాయ్: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహిళా క్రికెటర్ స్మృతి మంధానాలకు ఐసిసి అవార్డులు వరించాయి. ఐసిసి అవార్డులు రెండు విభాగాల్లోనూ భారత ప్లేయర్స్‌కే వరించడం చరిత్రలో ఇదే తొలిసారి. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ప్రతినెల అత్యుత్తమ ఆటగాళ్లకు అవార్డును ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూన్ నెలకుగాను పురుషుల విభాగంలో పేసర్ బుమ్రాకు, మహిళల విభాగంలో స్మృతి మంధాన ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఐసిసి టి20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యుత్తమ బౌలింగ్‌తో మెరిసినందుకు బుమ్రాకు, దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలతో పాటు రాణించిన మంధానాకు ఈ అవార్డులు దక్కాయి. భారత పేసర్‌కు ఐసిసి అవార్డు దక్కడం ఇది రెండోసారి. గతంలో భువనేశ్వర్ కుమార్‌కు తొలిసారి ఐసిసి అవార్డు వరించింది. ఇక మహిళల విభాగంలో హర్మన్ ప్రీత్, దీప్తి శర్మతోపాటు ఈ అవార్డుకు ఎంపికైన మూడో ప్లేయర్ మంధాన మాత్రమే.
