వైడ్‌ బంతుల నిబంధనల్లో మార్పులు: ఐసిసి

Jan 12,2025 01:21 #Changes, #Cricket, #icc, #rules, #Sports, #wide balls

క్రికెట్‌లో వైడ్‌ నిబంధనల్లో మార్పులకు అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ(ఐసిసి) శ్రీకారం చుట్టనుంది. బౌలర్లకూ అనుకూలంగా వైడ్‌ నిబంధనల్లో మార్పులు చేయాలని ఐసిసి భావిస్తోందని మాజీ క్రికెటర్‌, ఐసిసి క్రికెట్‌ కమిటీ సభ్యుడు షాన్‌ పొలాక్‌ వెల్లడించాడు. ప్రస్తుతం ఉన్న రూల్స్‌ వల్ల బౌలర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించాడు. వన్డేలు, టీ20ల్లో బౌలర్ల ఏకాగ్రతను దెబ్బకొట్టేలా బ్యాటర్లు క్రీజ్‌లో మూమెంట్స్‌ ఇస్తుంటారు. అలాంటప్పుడు బౌలర్‌ బంతిని స్టంప్స్‌కు కాస్త దూరంగా వేస్తాడు. ఇకనుంచి అలాంటి వాటిపైనా అంపైర్లు దష్టి పెట్టనున్నట్లు పొలాక్‌ తెలిపాడు. ”ఐసిసి క్రికెట్‌ కమిటీ సభ్యుడిగా నేను ఇదే అంశంపై పని చేస్తున్నా. బ్యాటర్లతోపాటు బౌలర్లకూ ప్రయోజనం కలిగేలా మారుస్తాం. ఇప్పుడున్నవి చాలా కఠినంగా ఉన్నాయి. ఒకవేళ బ్యాటర్‌ చివరి నిమిషంలో క్రీజ్‌లో నుంచి బయటకు వెళ్తే బౌలర్‌ సరైన ప్రదేశంలో బంతిని విసరలేడు. బౌలింగ్‌ చేసేటప్పుడు రన్నప్‌ నుంచే అతడు ఎక్కడ బంతిని వేయాలని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బ్యాటర్‌ కదిలినప్పుడు.. బంతి దూరంగా వెళ్లిందనుకుందాం. అప్పుడు ఆ బ్యాటర్‌ ఎక్కడైతే ఉన్నాడో.. అక్కడి నుంచి బంతి దూరాన్ని పరిశీలనలోకి తీసుకోవాలి. అప్పుడే వైడ్‌పై ఓ నిర్ణయానికి రావాలి. నేను చూడాలనుకుంటున్న మార్పు ఇదే. ఇది ప్రస్తుతం చర్చల్లో ఉంది. బౌలర్లకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఈమేరకు ఆలోచన చేశాం” అని పొలాక్‌ వెల్లడించాడు.

➡️