IND vs NZ : ఛాంపియన్‌ ఎవరో..?

  • నేడు భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య టైటిల్‌ పోరు
  • మ. 2.30గం||ల నుంచి

దుబాయ్: ప్రతిష్ఠాత్మక ఐసిసి ఛాంపియన్స్‌ ట్రోఫీని ఏ జట్టు కైవసం చేసుకోనుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. దుబారు ఇంటర్నేషనల్‌ స్టేడియంలో భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఆదివారం టైటిల్‌ సంగ్రామం జరగనుంది. లీగ్‌ దశలో అప్రతిహాత విజయాలతో ఫైనల్లో దూసుకొచ్చిన టీమిండియా.. ఆ క్రమంలోనే న్యూజిలాండ్‌పైనా విజయం సాధించింది. మరోవైపు న్యూజిలాండ్‌ జట్టు భారత్‌ చేతిలో ఓడినా.. లీగ్‌ దశలో రెండు మ్యాచుల్లో, సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారీ విజయాన్ని సొంతం చేసుకొని టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. లీగ్‌ దశలో న్యూజిలాండ్‌ను చిత్తుచేసిన టీమిండియా అందుకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తోంది. మెగాటోర్నీలో ఓటమి అన్నది ఎరుగకుండా అజేయంగా ఫైనల్లోకి దూసుకొచ్చిన రోహిత్‌సేన.. ఫైనల్లోనూ అదే ప్రదర్శనను కనబరిస్తే టైటిల్‌ కొట్టడం ఖాయం. ఐసిసి మెగా టోర్నీల్లో తమకు కొరకరాని కొయ్యగా మారిన కివీస్‌కు ఎలాగైనా ఈసారి చెక్‌ పెట్టాలని టీమిండియా ఆటగాళ్లంతా రెండ్రోజులు నెట్‌ ప్రాక్టీస్‌లో మునిగి తేలారు. బలబలాల పరంగా చూస్తే ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నా.. ప్రస్తుతం టీమిండియా ఫామ్‌ చూస్తే బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా కివీస్‌ కంటే మెరుగ్గా ఉంది. బ్యాటింగ్‌లో కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, రాహుల్‌, రోహిత్‌, గిల్‌, హార్దిక్‌ వీరిలో ఏ ఒక్కరు నిలదొక్కుకున్నా.. మ్యాచ్‌ స్వరూపం మారడం ఖాయం. ఇక బౌలింగ్‌లో వరుణ్‌ చక్రవర్తి, మహ్మద్‌ షమీ అద్భుత ఫామ్‌ మనకు కలిసి రానుంది. ఇక కివీస్‌ విషయానికొస్తే.. రచిన్‌ రవీంద్ర, విలియమ్సన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. హెన్రీ గాయం జట్టును కలవరపెడుతోంది. 2002, 2013లో టైటిల్‌ విజేతగా నిలిచిన భారత్‌.. ముచ్చటగా మూడో ఛాంపియన్స్‌ ట్రోఫీపై కన్నేయగా.. 2000లో తొలిసారి టైటిల్‌ను చేజిక్కించుకున్న న్యూజిలాండ్‌ జట్టు రెండోసారి ఈ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. గత నెల 19న న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌తో ప్రారంభమైన 9వ చాంపియన్స్‌ ట్రోఫీ మార్చి 9న జరిగే మ్యాచ్‌తో ముగియనుంది.

రోహిత్‌కి కలిసిరాని టాస్‌

భారత్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకి మాత్రం ప్రస్తుతం టాస్‌ కలిసి రావట్లేదు. రోహిత్‌ వరుసగా గత 14 వన్డే మ్యాచ్‌లలో టాస్‌ గెలవలేక పోయాడు. 2023 నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచ కప్‌ ఫైనల్‌తో ప్రారంభమైన ఈ టాస్‌ పరాజయాల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే భారత్‌ మాత్రం ఈ 14 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలు సాధించింది, నాలుగింటిలో ఓటమి పాలై.. ఒక మ్యాచ్‌ (శ్రీలంకతో)తో టై గా ముగిసింది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ టీమిండియా టాస్‌ ఓడినా.. అన్ని మ్యాచుల్లో విజయం సాధించడం విశేషం. దీంతో టాస్‌ భారత్‌ విజయావకాశాలపై ప్రభావం చూపించలేదన్నది వాస్తవం. ఈ మైదానంలో ఛేదనకు దిగే జట్టుకు విజయావకాశాలు మెండుగా ఉంటాయని సమాచారం.

జట్లు(అంచనా)…
భారత్‌: రోహిత్‌(కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లి, శ్రేయస్‌, హార్దిక్‌, కెఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), అక్షర్‌, జడేజా, వరుణ్‌, కుల్దీప్‌, షమీ.

న్యూజిలాండ్‌: సాంట్నర్‌(కెప్టెన్‌), యంగ్‌, రవీంద్ర, విలియమ్సన్‌, మిఛెల్‌, లాథమ్‌(వికెట్‌ కీపర్‌), ఫిలిప్స్‌, బ్రాస్‌వెల్‌, హెన్రీ, జెమీసన్‌, రూర్కే.

➡️