IPL 2025 – నేడు మరో బిగ్‌ ఫైట్‌ …!

Mar 26,2025 12:31 #Another big fight today, #IPL 2025

గౌహతి : ఐపిఎల్‌ 2025లో నేడు మరో బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ కేకేఆర్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ ఆటలో విజయాన్ని అందుకోవడానికి రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ సీజన్‌లో కేకేఆర్‌, రాయల్స్‌ తమతమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాయి. కేకేఆర్‌.. ఆర్సీబీ చేతిలో, రాయల్స్‌ సన్‌రైజర్స్‌ చేతిలో పరాజయం పొందాయి.

మ్యాచ్‌లో తడబడిన కేకేఆర్‌ ….
డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్‌ ఆర్సీబీతో మ్యాచ్‌లో తడబడింది. ఆ జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అంచనాలను అందుకోలేకపోయింది. బ్యాటింగ్‌లో కొత్త కెప్టెన్‌ అజింక్య రహానే పర్వాలేదనిపించగా.. సునీల్‌ నరైన్‌ ఆల్‌రౌండర్‌గా రాణించాడు. డికాక్‌, వైస్‌ కెప్టెన్‌ వెంకటేశ్‌ అయ్యర్‌, రింకూ సింగ్‌, రసెల్‌ నిరాశపరిచారు. భారీ అంచనాల మధ్యలో బరిలోకి దిగిన వరుణ్‌ చక్రవర్తి తేలిపోయాడు. ఆర్సీబీ బ్యాటర్లు వరుణ్‌ను ఆటాడుకున్నారు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ వైభవ్‌ అరోరా, మరో పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. హర్షిత రాణాను ప్రత్యర్ధి బ్యాటర్లు ఉతికి ఆరేశారు. మొత్తంగా తొలి మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమైన కేకేఆర్‌ నేడు రాయల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో సత్తా చాటాలని భావిస్తుంది.

సత్తా చాటిన రాయల్స్‌ …
రాయల్స్‌ విషయానికొస్తే.. ఈ జట్టు బ్యాటర్లు సన్‌రైజర్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ కూడా సత్తా చాటారు. గాయం కారణంగా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రెగ్యులర్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌, వికెట్‌ కీపర్‌ దఅవ్‌ జురెల్‌ మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడ్డారు. హెట్‌మైర్‌, శుభమ్‌ దూబే కూడా ధనాధన్‌ బ్యాటింగ్‌ చేశారు. భారీ అంచనాలకు కలిగిన యశస్వి జైస్వాల్‌, రియాన్‌ పరాగ్‌, నితీశ్‌ రాణా మాత్రం నిరాశపరిచారు. బౌలరల్లో జోఫ్రా ఆర్చర్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అతను 4 ఓవర్లలో ఏకంగా 76 పరుగులిచ్చాడు. ఫజల్‌ హక్‌ ఫారూకీ, తీక్షణ, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే కూడా ఊహించిన దానికంటే ఎక్కువ పరుగులు ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ చిచ్చరపిడుగుల ముందు రాయల్స్‌ బౌలర్లు తేలిపోయారు. కేకేఆర్‌తో జరుగబోయే నేటి మ్యాచ్‌లో బౌలింగ్‌ లోపాలను అధిగమించాలని రాయల్స్‌ భావిస్తుంది.

హెడ్‌ టు హైడ్‌ రికార్డులపరంగా ….
హెడ్‌ టు హెడ్‌ రికార్డుల విషయానికొస్తే.. ఇరు జట్లకు ఇప్పటివరకు 30 మ్యాచ్‌ల్లో తలపడగా, తలో 14 మ్యాచ్‌లు గెలిచాయి. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇరు జట్ల మధ్య చివరిసారి జరిగిన మ్యాచ్‌ రద్దైంది. ఆ మ్యాచ్‌ కూడా నేటి మ్యాచ్‌ జరుగబోయే గౌహతిలో జరగాల్సి ఉండింది. దీనికి ముందు గత సీజన్‌లోనే జరిగిన మరో మ్యాచ్‌లో కేకేఆర్‌ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాయల్స్‌ చివరి బంతికి ఛేదించింది. ఆ మ్యాచ్‌లో జోస్‌ బట్లర్‌ సూపర్‌ సెంచరీ చేసి రాయల్స్‌ను గెలిపించాడు. అదే మ్యాచ్‌లో కేకేఆర్‌ తరఫున సునీల్‌ నరైన్‌ కూడా శతక్కొట్టాడు.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ : క్వింటన్‌ డికాక్‌, సునీల్‌ నరైన్‌, అజింక్య రహానే(కెప్టెన్‌), వెంకటేష్‌ అయ్యర్‌, రింకూ సింగ్‌, అంగ్క్రిష్‌ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్‌, రమణదీప్‌ సింగ్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, అన్రిచ్‌ నోర్జే, మనీశ్‌ పాండే, వైభవ్‌ అరోరా, అనుకూల్‌ రారు, లవ్నిత్‌ సిసోడియా, చేతన్‌ సకారియా, రహ్మానుల్లా గుర్బాజ్‌, మయాంక్‌ మార్కండే, రోవ్‌మన్‌ పావెల్‌, మొయిన్‌ అలీ

రాజస్థాన్‌ రాయల్స్‌ : యశస్వి జైస్వాల్‌, శుభమ్‌ దూబే, నితీష్‌ రాణా, రియాన్‌ పరాగ్‌(కెప్టెన్‌), దృవ్‌ జురెల్‌, షిమ్రోన్‌ హెట్మెయర్‌, జోఫ్రా ఆర్చర్‌, మహేశ్‌ తీక్షణ, తుషార్‌ దేశ్‌పాండే, సందీప్‌ శర్మ, ఫజల్‌హాక్‌ ఫరూఖీ, సంజూ శాంసన్‌, కునాల్‌ సింగ్‌ రాథోడ్‌, ఆకాశ్‌ మధ్వాల్‌, కుమార్‌ కార్తికేయ, క్వేనా మఫాకా, వనిందు హసరంగ, యుధ్వీర్‌ సింగ్‌ చరక్‌, అశోక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ

➡️