IPL 2025 షెడ్యూల్‌ వచ్చేసింది..

Feb 17,2025 00:32 #Cricket, #IPL 2025, #Sports
  • ఈడెన్‌గార్డెన్స్‌లో ఐపీఎల్‌ తొలి, ఫైనల్‌ మ్యాచ్‌
  • క్వాలిఫయర్‌1, ఎలిమినేటర్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యం
  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 షెడ్యూల్‌ విడుదల

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2025 షెడ్యూల్‌ వచ్చేసింది. 74 మ్యాచులు, 65 రోజుల పాటు అలరించేందుకు మార్చి 22న ఐపీఎల్‌ అభిమానుల ముందుకు రానుంది. సీజన్‌ తొలి, ఫైనల్‌ మ్యాచ్‌కు ఈడెన్‌గార్డెన్స్‌ వేదిక కానుండగా.. క్వాలిఫయర్‌ 1, ఎలిమినేటర్‌ మ్యాచులకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కత నైట్‌రెడర్స్‌ సొంత మైదానం ఈడెన్‌గార్డెన్స్‌ 2025 సీజన్‌ తొలి, ఫైనల్‌ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుండగా, గత సీజన్‌ రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంత మైదానం ఉప్పల్‌ స్టేడియం క్వాలిఫయర్‌ 1, ఎలిమినేటర్‌లకు వేదిక కానుంది. 2025 ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌ మార్చి 22న జరుగనుండగా, టైటిల్‌ పోరు మే 25న షెడ్యూల్‌ చేశారు. ఈ మేరకు ఐపీఎల్‌ షెడ్యూల్‌ను లీగ్‌ నిర్వాహకులు ఆదివారం విడుదల చేశారు. 2013, 2015లో ఐపీఎల్‌ ఫైనల్స్‌కు వేదికగా నిలిచిన కోల్‌కత ఈడెన్‌ గార్డెన్స్‌ సుమారు దశాబ్దం తర్వాత మళ్లీ ఐపీఎల్‌ అంతిమ సమరానికి వేదిక కానుంది.

పది జట్లు, రెండు గ్రూప్‌లు : ఐపీఎల్‌ 2025 టైటిల్‌ వేటలో పది జట్లు నిలిచాయి. పది జట్లను సీడింగ్‌ ప్రకారం రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఏలో కోల్‌కత నైట్‌రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఉండగా.. గ్రూప్‌-బిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, ముంబయి ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిలిచాయి. ప్రతి జట్టు సొంత గ్రూప్‌లోని ఇతర నాలుగు జట్లతో, ఆవల గ్రూప్‌లోని సమాన సీడింగ్‌ కలిగిన జట్టుతో రెండేసి మ్యాచులు ఆడనుంది. దీనికి తోడు ఆవల గ్రూప్‌లోని ఇతర నాలుగు జట్లతో ఒక్కోసారి తలపడనుంది. అంతిమంగా, ప్రతి జట్టు లీగ్‌ దశలో 14 మ్యాచులు ఆడుతుంది. లీగ్‌ దశ సహా ప్లే ఆఫ్స్‌తో కలిసి 74 మ్యాచులు షెడ్యూల్‌ చేశారు. ఓవరాల్‌గా పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.

హైదరాబాద్‌లో ప్లే ఆఫ్స్‌ : ఐపీఎల్‌లో ఈ సీజన్‌లో హైదరాబాద్‌ ఏడు లీగ్‌ దశ మ్యాచులు సహా రెండు కీలక ప్లే ఆఫ్స్‌ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 22న కోల్‌కతలో ఆరంభ మ్యాచ్‌ ఉండగా.. తర్వాతి రోజు లీగ్‌లో రెండో మ్యాచ్‌ హైదరాబాద్‌లో జరుగనుంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో తలపడనుంది. సొంత మైదానంలో రాజస్థాన్‌ రాయల్స్‌ సహా లక్నో సూపర్‌జెయింట్స్‌ (మార్చి 27), గుజరాత్‌ జెయింట్స్‌ (ఏప్రిల్‌ 6), పంజాబ్‌ కింగ్స్‌ (ఏప్రిల్‌ 12), ముంబయి ఇండియన్స్‌ (ఏప్రిల్‌ 23), ఢిల్లీ క్యాపిటల్స్‌ (మే 5), కోల్‌కత నైట్‌రైడర్స్‌ (మే 10)తో సన్‌రైజర్స్‌ తలపడనుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ మరో గ్రూప్‌లో ఉండగా ఈసారి గ్రూప్‌ దశలో ఆ జట్లతో ఒక్కసారి మాత్రమే ఆడనుండగా.. ఆ రెండు మ్యాచులను సైతం బెంగళూర్‌, చెన్నైలో షెడ్యూల్‌ చేశారు. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన నాలుగు జట్లు కచ్చితంగా హైదరాబాద్‌లో ఓ మ్యాచ్‌ ఆడనున్నాయి. క్వాలిఫయర్‌ 1, ఎలిమినేటర్‌ మ్యాచులు ఉప్పల్‌లో జరుగనున్నాయి. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటే.. ఈ సీజన్లోనూ విరాట్‌ కోహ్లి, ఎం.ఎస్‌ ధోని మెరుపులను ఉప్పల్‌ స్టేడియంలో వీక్షించవచ్చు.

13 స్టేడియాల్లో.. : ఐపీఎల్‌ మ్యాచులు ఈ సీజన్‌లో ఏకంగా 13 స్టేడియాల్లో జరుగనుంది. సంప్రదాయ పది స్టేడియాలకు తోడు ఈసారి మరో మూడు స్టేడియాలు అదనంగా తోడయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు రెండో సొంత మైదానంగా విశాఖపట్నంను ఎంచుకుంది. పంజాబ్‌ కింగ్స్‌ రెండో సొంత మైదానంగా ధర్మశాలను ఎంచుకోగా.. గువహటిని రాజస్థాన్‌ రాయల్స్‌ రెండో సొంత మైదానంగా ఎంచుకుంది. ధర్మశాలలో పంజాబ్‌ కింగ్స్‌ వరుసగా మూడు మ్యాచులు (మే 4-11) ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌తో వరుస మ్యాచుల్లో ఆడనుంది. మరో జట్టు సైతం వరుసగా సొంత గడ్డపై మూడు మ్యాచులు ఆడటం లేదు. విశాఖపట్నంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడనుంది. గువహటిలో రాయల్స్‌ సైతం రెండు మ్యాచులు ఆడనుంది. ఈ సీజన్‌లో 74 మ్యాచులను 65 రోజుల్లో షెడ్యూల్‌ చేయగా.. అందులో 12 డబుల్‌ హెడర్స్‌ ఉన్నాయి. రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌లు మూడేసి మధ్యాహ్నం మ్యాచులు ఆడనుండగా.. ఇతర ఏడు జట్లు రెండేసి మ్యాచులు ఆడనున్నాయి. రాత్రి మ్యాచులు 7.30 గంటలకు, మధ్యాహ్నం మ్యాచులు 3.30 గంటలకు ఆరంభం అవుతాయి.

Image

Image

➡️