IPL auction : ఆ ఐదుగురు ఆటగాళ్లు.. మళ్లీ ఆ ఫ్రాంచైజీల చెంతకే..

Nov 28,2024 03:56 #aswin, #IPL, #IPL-2025 auction

జెడ్డా: సౌదీ అరేబియా వేదికగా 24, 25 తేదీల్లో జరిగిన వేలంలో ఐదుగురు ఆటగాళ్లు మళ్లీ పాత ఫ్రాంచైజీల చెంతకు చేరారు. వీరిలో రవిచంద్రన్‌ అశ్విన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జోఫ్రా ఆర్చర్‌, దేవదత్‌ పడిక్కల్‌ తదితరులు ఉన్నారు. అరంగేట్రం సీజన్‌లలో వీరు ఆ ఫ్రాంచైజీల తరఫున ఆడినా.. ఆ తర్వాత వివిధ ఫ్రాంచైజీల చెంతకు చేరారు. 2025 ఐపిఎల్‌ సీజన్‌ కోసం జరిగిన వేలంలో వీరిని మళ్లీ పాత ఫ్రాంచైజీలు తమ చెంతకే చేర్చుకున్నాయి.

రవిచంద్రన్‌ అశ్విన్‌(చెన్నై సూపర్‌కింగ్స్‌) : 2025 వేలంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ.9.75కోట్లకు కొనుగోలు చేసింది. అశ్విన్‌ 2009లో ధోనీ సారథ్యవంలో చెన్నై తరఫున ఐపిఎల్‌లో అరంగేట్రం చేశాడు. అరంగేట్రం సీజన్‌లో అశ్విన్‌ కేవలం 2మ్యాచుల్లో మాత్రమే ఆడాడు. ఆ తర్వాత 2015వరకు చెన్నై ఫ్రాంచైజీలోనే కొనసాగాడు. ఆ ఫ్రాంచైజీ 2010, 2011లో టైటిళ్లను చేజిక్కించుకున్న జట్టులో అశ్విన్‌ ఓ ఆటగాడు. 2015 తర్వాత పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఆడిన అశ్విన్‌.. మళ్లీ 2025వేలంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ కొనుగోలు చేసింది.

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(పంజాబ్‌ కింగ్స్‌) : ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ తిరిగి పంజాబ్‌ కింగ్స్‌ చెంతకు చేరాడు. 2020 తర్వాత పంజాబ్‌ కింగ్స్‌కు దూరమైన మ్యాక్స్‌వెల్‌.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ జట్టుతో కలిసాడు. 2014 నుంచి 2017వరకు పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్‌.. 2014 సీజన్‌లో 187.75 స్ట్రయిక్‌రేట్‌తో ఏకంగా 552పరుగులు చేశాడు. గత నాలుగేళ్లు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్‌.. 2025 సీజన్‌కోసం జరిగిన వేలంలో రూ.4.20కోట్లకు మళ్లీ పంజాబ్‌ కింగ్స్‌ వేలంలో కొనుగోలు చేసింది.

ట్రెంట్‌ బౌల్ట్‌(ముంబయి ఇండియన్స్‌) : న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్డ్‌ మళ్లీ ముంబయి ఇండియన్స్‌ దక్కించుకుంది. 2020వరకు ముంబయి ఇండియన్స్‌కు ఆడిన బౌల్ట్‌.. 2021 సీజన్‌ నుంచి 2024 వరకు రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడాడు. 2020 సీజన్‌లో 15మ్యాచుల్లో 25వికెట్లు తీసిన బౌల్ట్‌.. ముంబయి జట్టు టైటిల్‌ చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. 2025 సీజన్‌కోసం జరిగిన వేలంలో బౌల్ట్‌ను ముంబయి ఇండియన్స్‌ రూ.12.50కోట్లకు దక్కించుకుంది. జస్ప్రీత్‌ బుమ్రాతో కలిసి రాబోయే సీజన్‌లో అతడు పేస్‌ భారాన్ని మోయనున్నాడు.

జోఫ్రా ఆర్చర్‌(రాజస్తాన్‌ రాయల్స్‌) : ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ తిరిగి రాజస్థాన్‌ రాయల్స్‌ వేలంలో దక్కించుకుంది. 2018 నుంచి 2020వరకు రాజస్తాన్‌ తరఫున ఆడిన ఆర్చర్‌.. మూడు సీజన్లలో కలిపి మొత్తం 46వికెట్లు పడగొట్టాడు. 2020 సీజన్‌ ఒక్కదానిలోనే ఆర్చర్‌ 14 మ్యాచుల్లో 20వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 2021, 22 సీజన్‌లలో గాయం కారణంగా ఐపిఎల్‌కు దూరం కాగా.. 2023 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఆడాడు. ఐదు మ్యాచుల్లో ఒక్క వికెట్‌ కూడా సాధించలేకపోయాడు. ఆ తర్వాత ఐపిఎల్‌కు దూరంగా ఉన్నాడు. తాజా వేలంలో రాజస్తాన్‌ రాయల్స్‌ రూ.12.50కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది.

దేవదత్‌ పడిక్కల్‌(రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు) : ఎడమచేతి వాటం స్టార్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ను ఈసారి వేలంలో రూ.2కోట్లకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. 2020 సీజన్‌లో బెంగళూరు తరఫున ఆడిన పడిక్కల్‌ 473పరుగులు చేసి రాణించాడు. 2021లో ఒక సెంచరీతో కదం తొక్కాడు. ఆ తర్వాత 2022, 2023 సీజన్‌లలో రాజస్తాన్‌ రాయల్స్‌కు, 2024లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఆడిన పడిక్కల్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. గత సీజన్‌లో ఏడు మ్యాచుల్లో కేవలం 38పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో బెంగళూరు ఫ్రాంచైజీ మరోసారి అతడి ప్రదర్శనను ఆధారంగా తీసుకొని తిరిగి వేలంలో కొనుగోలు చేసింది.

➡️