IPL: తిప్పేసిన నరైన్‌, వరుణ్‌

Apr 12,2025 00:02 #IPL 2025, #kkr

చెన్నై సూపర్‌కింగ్స్‌పై కోల్‌కతా ఘన విజయం
3వ స్థానానికి డిఫెండింగ్‌ ఛాంపియన్‌

చెన్నై: అత్యధిక టైటిళ్లు నెగ్గిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఈ సీజన్‌ ఐపిఎల్‌లో కలిసి రావడం లేదు. నూతన సారథిగా పగ్గాలు అందుకున్న మహేంద్ర సింగ్‌ ధోనీ కూడా చెన్నైను గాడిలో పెట్టలేకపోయాడు. చెపాక్‌ స్టేడియంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. చెన్నై నిర్దేశించిన 104పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా జట్టు 10.1ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. డికాక్‌(23), నరైన్‌(44)కి తోడు రహానే(20), రింకు(15) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. అంతకుముందు కోల్‌కతా స్పిన్నర్లు నరైన్‌(3/13), వరుష్‌ చక్రవర్తి(2/22), మొయిన్‌ అలీ(1/20) కట్టడిగా బౌలింగ్‌ చేశారు. దీంతో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైను కేవలం 103పరుగులకే పరిమితం చేశారు. చెన్నై ఓపెనర్లు డెవాన్‌ కాన్వే(12), రచిన్‌ రవీంద్ర(4)లు విఫలమయ్యారు. మోయిన్‌ అలీ బౌలింగ్‌లో డెవాన్‌ కాన్వే స్వీప్‌ షాట్‌ ఆడబోయి ఎల్బీగా వెనుదిరిగడంతో మొదలు చెన్నై వికెట్ల పతనం మొదలైంది. హర్షిత్‌ రానా వేసిన షార్ట్‌ పిచ్‌ బంతికి రచిన్‌ రవీంద్ర(0) బోల్తా పడ్డాడు. 16 పరుగులకే 2 కీలక వికెట్లు పడిన దశలో విజరు శంకర్‌ (29), రాహుల్‌ త్రిపాఠి(16)లు ధాటిగా ఆడారు. దీంతో పవర్‌ప్లే 6ఓవర్లు ముగిసేసరికి చెన్నై 2వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. ఆ తర్వాత సునీల్‌ నరైన్‌ మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు. శంకర్‌, దీపక్‌ హుడా(0)లను వరుణ్‌ చక్రవర్తి ఔట్‌ చేయగా.. అశ్విన్‌(1)ను హర్షిత్‌ రానా పెవిలియన్‌ పంపాడు. జడేజా(0), ఎంఎస్‌ ధోనీ(1)ని ఎల్బీగా ఔట్‌ చేసి సీఎస్కే భారీ స్కోర్‌ ఆశలపై నీళ్లు చల్లాడు నరైన్‌. ప్రధాన ఆటగాళ్లంతా డగౌట్‌ చేరడంతో శివం దూబే(31 నాటౌట్‌)కు సహరించేవాళ్లు కరువయ్యారు. వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో నూర్‌ అహ్మద్‌(1) కొట్టిన బంతిని వెంకటేశ్‌ అయ్యర్‌ డైవ్‌ చేస్తూ సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో చెన్నై 79 పరుగుల వద్ద 9వ వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత దూబే 19వ ఓవర్లో బౌండరీతో కొట్టాడు. 20వ ఓవర్లో ఫైన్‌ లెగ్‌ దిశగా ఫోర్‌.. ఆఖరి బంతికి బౌండరీ కొట్టి స్కోర్‌ 100 దాటించాడు. డెత్‌ ఓవర్లలో మూడు బౌండరీలతో 100 దాటించి.. జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ అందించాడు. ఈ ఎడిషన్‌లో ఇదే అత్యల్ప స్కోర్‌ కావడం విశేషం. ఛేదనలో విఫలమయ్యే చెన్నై బ్యాటర్లు ఈసారి తొలిగా బ్యాటింగ్‌ అవకాశం దక్కినా ప్రత్యర్ధి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో విఫలమయ్యారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ నరైన్‌కు లభించింది.

స్కోర్‌బోర్డు…
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రచిన్‌ రవీంద్ర (సి)రహానే (బి)హర్షీత్‌ రాణా 4, కాన్వే (ఎల్‌బి)మొయిన్‌ 12, త్రిపాఠి (బి)నరైన్‌ 16, విజరు శంకర్‌ (సి)మొయిన్‌ (బి)వరుణ్‌ చక్రవర్తి 29, దూబే (నాటౌట్‌) 31, అశ్విన్‌ (సి)వైభవ్‌ అరోరా (బి)హర్షీత్‌ రాణా 1, జడేజా (సి)డికాక్‌ (బి)నరైన్‌ 0, హుడా (సి)వైభవ్‌ అరోరా (బి)వరుణ్‌ చక్రవర్తి 0, ధోనీ (ఎల్‌బి)నరైన్‌ 1, నూర్‌ అహ్మద్‌ (సి)వరుణ్‌ చక్రవర్తి (బి)వైభవ్‌ అరోరా 1, కంబోజ్‌ (నాటౌట్‌) 3, అదనం 5. (20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 103పరుగులు. వికెట్ల పతనం: 1/16, 2/16, 3/59, 4/65, 5/70, 6/71, 7/72, 8/75, 9/79 బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4-0-31-1, మొయిన్‌ అలీ 4-1-20-1, హర్షీత్‌ రాణా 4-0-16-2, వరుణ్‌ 4-0-22-2, నరైన్‌ 4-0-13-3.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి)కంబోజ్‌ 23, నరైన్‌ (బి)నూర్‌ అహ్మద్‌ 44, రహానే (నాటౌట్‌) 20, రింకు సింగ్‌ (నాటౌట్‌) 15, అదనం 5. (10.1ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 107పరుగులు. వికెట్ల పతనం: 1/46, 2/85 బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 3-0-40-0, కంబోజ్‌ 2-0-19-1, అశ్విన్‌ 3-0-30-0, నూర్‌ అహ్మద్‌ 2-0-8-1, జడేజా 0.1-0-9-0.

➡️