లక్నో: టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఇరానీ కప్‌లో అదరగొట్టాడు. కేవలం 253 బంతుల్లోనే 23 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ బాదాడు. 150 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న సర్ఫరాజ్.. మరో 103 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే ఇరానీ కప్‌లో ముంబయి తరఫున ద్విశతకం సాధించిన తొలి బ్యాటర్, అతి పిన్న వయసు (26 ఏళ్ల 346 రోజులు)లో ద్విశతకం చేసిన నాలుగో ఆటగాడిగా సర్ఫరాజ్ ఘనత సాధించాడు. ముంబయి జట్టు రెండోరోజైన బుధవారం ఆట ముగిసే సమయానికి 9వికెట్ల నష్టానికి 536 పరుగులు చేసింది. సర్ఫరాజ్ (221నాటౌట్)కి తోడు జునైద్ ఖాన్(0) క్రీజులో ఉన్నారు. కెప్టెన్ అజింక్య రహానె (97) సెంచరీ మిస్ చేసుకోగా.. శ్రేయస్ అయ్యర్ (57), తనుష్ కొటియన్ (64) అర్ధ శతకాతో రాణించారు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్‌కు నాలుగు, యశ్ దయాళ్, ప్రసిద్ధ్ కృష్ణకు రెండేసి, శరన్ష్ జైన్ ఒక వికెట్ పడగొట్టారు.