ముంబయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ఛైర్మన్ రేసులో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) సెక్రటరీ జే షా ఉన్నారు. ప్రస్తుత ఛైర్మన్‌గా గ్రెగ్ బార్క్‌లే నాలుగు సంవత్సరాల పదవీకాలం ఈ ఏడాది నవంబర్ తో ముగియనుంది. అతడు మరో టర్మ్ ఛైర్మన్‌గా కొనసాగడానికి అర్హత ఉంది. కానీ, జే షా పోటీ చేస్తే ఎన్నిక తప్పదు. జే షా మద్దతుతోనే బార్క్‌లే తొలిసారి ఐసిసి ఛైర్మన్ ఎన్నికయ్యారు. ఈ దఫా జే షా రేసులో నిలిస్తే బార్క్‌లే ఎన్నికల బరిలో నిలవడం అసాధ్యం. దీంతో జే షా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ జై షా ఈ పదవిని చేపడితే అత్యంత పిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ఐసిసి వార్షిక సమావేశం జులై 19-22 మధ్య కొలంబోలో జరగనుంది. ఈ వార్షిక సదస్సులో ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన టైమ్‌లైన్‌ను అధికారికంగా రూపొందించనున్నారు.
