Pinkball test: ఓపెనర్లుగా కెఎల్‌ రాహుల్‌, జైస్వాల్‌

  • నేటినుంచి పింక్‌బాల్‌ టెస్ట్‌
  • ఉ.9.30గం||ల నుంచి

ఆడిలైడ్‌: భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆడిలైడ్‌ వేదికగా నేటినుంచి పింక్‌బాల్‌ టెస్ట్‌ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా.. రెండోటెస్ట్‌లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా.. మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ టెస్ట్‌కు సిద్ధమైంది. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ తొలి టెస్ట్‌లో ఓటమి, గత రెండు సీజన్‌లలోనూ స్వదేశంలో భారత్‌ చేతిలో ఓటమితో డీలా పడింది. రెండో టెస్టుకు ఒకరోజు ముందే ఆస్ట్రేలియా తుది జట్టును ప్రకటించింది. స్పీడ్‌ బౌలర్‌ స్కాట్‌ బోలాండ్‌కు చోటు దక్కింది. 18 నెలల బ్రేక్‌ తర్వాత అతను మళ్లీ జాతీయ జట్టుకు ఆడనున్నట్లు కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ తెలిపాడు. అడిలైడ్‌లో డే అండ్‌ నైట్‌ టెస్టు కావడంతో.. బోలాండ్‌కు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. తొలి టెస్టులో గాయపడ్డ జోష్‌ హేజిల్‌వుడ్‌ స్థానంలో అతడు జట్టులో చేరాడు. ఆల్‌రౌండర్‌ మార్ష్‌కు వెన్ను నొప్పి ఉన్నా.. అతన్ని రెండో టెస్టుకు అందుబాటులో ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం మనూకా ఓవల్‌లో ప్రైమ్‌మినిస్టర్‌ లెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో బోలాండ్‌ మెరుగ్గా బౌలింగ్‌ చేశాడు. వికెట్‌ తీసుకోకున్నా.. బ్యాటర్‌ను కట్టడి చేయగలిగాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా రెండు జట్ల మధ్య అయిదు టెస్టు మ్యాచ్‌లు జరగనుంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్‌ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మిడిలార్డర్‌లో రోహిత్‌..

తొలిటెస్ట్‌లో రాణించిన కెఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌ రెండోటెస్ట్‌కూ ఓపెనర్లుగా రానున్నట్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు. రెండోటెస్ట్‌ ప్రారంభానికి ముందు జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోహిత్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. తొలిటెస్ట్‌లో ఈ జోడీ అద్భుతంగా రాణించిందని, ఆ టెస్ట్‌లో టీమిండియా గెలుపులో వీరి పాత్ర కీలకమైందని తెలిపాడు. తాను రెండోటెస్ట్‌ బరిలో దిగుతున్నా.. మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌కు దిగుతానని, ఇందులో ఎలాంటి మార్పుల్లేవని తెలిపాడు.

జట్లు(అంచనా)…
ఇండియా: రోహిత్‌(కెప్టెన్‌), కెఎల్‌ రాహుల్‌, జైస్వాల్‌, కోహ్లి, పంత్‌(వికెట్‌ కీపర్‌), నితీశ్‌రెడ్డి, పడిక్కల్‌, జడేజా/అశ్విన్‌, బుమ్రా, సిరాజ్‌, హర్షీత్‌ రాణా.

ఆస్ట్రేలియా: కమిన్స్‌(కెప్టెన్‌), ఖవాజా, స్వీనే, లబూషేన్‌, స్మిత్‌, హెడ్‌, క్యారీ(వికెట్‌ కీపర్‌), స్టార్క్‌, లియాన్‌/ బోలండ్‌, అబాట్‌.

➡️