బ్రెజిల్ : మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన యూఎఫ్‌సీ ఫ్లైవెయిట్ ఫైటర్ అలన్ నాసిమెంటో (34) గుండెపోటుతో సోమవారం ఉదయం మృతి చెందారు. నిద్రలోనే ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అత్యవసర వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న వైద్య బృందం సీపీఆర్ చేసినప్పటికీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని యూఎఫ్‌సీ అధికారికంగా ప్రకటించింది. 2021లో యూఎఫ్‌సీలో అరంగేట్రం చేసిన అలన్ నాసిమెంటో, ఆక్టాగన్‌లో 4 విజయాలు, 2 పరాజయాలతో తన ముద్ర వేశారు. ఇటీవల జూన్‌లో జరిగిన యూఎఫ్‌సీ పోరులో ఆయన చివరిసారిగా బరిలోకి దిగారు. ప్రొఫెషనల్ ఎంఎంఏ కెరీర్‌లో నాసిమెంటో మొత్తం 29 పోరాటాలు చేసి 22 విజయాలు సాధించగా, 7 పోరాటాల్లో ఓటమి పాలయ్యారు. ప్రముఖ కోచ్ డియెగో లిమా వద్ద శిక్షణ పొందిన ఆయన, మాజీ యూఎఫ్‌సీ లైట్‌వెయిట్ ఛాంపియన్ చార్లెస్ ఒలివెరా, లైట్‌వెయిట్ ఫైటర్ ఎల్వెస్ బ్రెనర్ తదితర అగ్రశ్రేణి బ్రెజిలియన్ ఫైటర్లతో కలిసి సాధన చేశారు. అలన్ నాసిమెంటో మృతిపై యూఎఫ్‌సీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయనను ప్రతిభావంతుడైన, అత్యున్నత నైపుణ్యాలు కలిగిన ఎంఎంఏ ఫైటర్‌గా కొనియాడుతూ, క్రీడకు అందించిన సేవలను స్మరించుకుంది. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
యూఎఫ్‌సీ ఫైటర్ అలన్ నాసిమెంటో కన్నుమూత
04 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 04, 2026, 02:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)