ఐపిఎల్‌లో రెండు కొత్త రూల్స్‌

Mar 20,2025 23:03 #BCCI, #Cricket, #IPL 2025, #Sports
  • బంతిపై లాలాజలం పూయవచ్చు
  • రెండో ఇన్నింగ్స్‌లో రెండు కొత్త బంతులు
  • రేపటినుంచి ఐపిఎల్‌ సీజన్‌-18

ముంబయి: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-18 శనివారం నుంచి ప్రారంభం కానుంది. టోర్నమెంట్‌ ప్రారంభానికి ముందు గురువారం 10జట్ల కెప్టెన్లలో బిసిసిఐ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో బిసిసిఐ బౌలర్లకు శుభవార్త తెలిపింది. లాలాజలం వాడకంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పలు కీలక నిర్ణయాలను కెప్టెన్లకు వివరించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బంతిని మెరిసేందుకు లాలాజలం వాడడాన్ని ఐసిసి నిషేధించింది. బిసిసిఐ సైతం ఐపిఎల్‌లోనూ ఈ నిషేధాన్ని అమలు చేసింది. ప్రస్తుతం కరోనా ముప్పు ఏమీ లేదని.. నిషేధం ఎత్తివేసినా ఇబ్బంది లేదని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. అలాగే, కొత్తగా ఐపిఎల్‌ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ తర్వాత రెండోబాల్‌ను ఇవ్వనుంది. రాత్రిపూట జరిగే ఈ మ్యాచ్‌పై పడే మంచు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈ రూల్‌ని తీసుకువచ్చింది. అయితే, బంతి మార్పుపై అంపైర్ల నిర్ణయానికే వదిలివేసింది. బంతిని మారుస్తారా? లేదా? అన్నది అంపైర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మంచు ప్రభావం ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ రూల్‌ రాత్రి మ్యాచులకు మాత్రమే వర్తించనుంది. ఐపిఎల్‌ సీజన్‌-18 ఈ నెల 22న డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరిగే తొలిమ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనుంది.
టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొంటాయి. 65 రోజులపాటు 13 వేదికల్లో 74 మ్యాచులు జరుగనున్నాయి. ఇందులో 70 లీగ్‌ మ్యాచులు, నాలుగు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు ఉంటాయి. క్వాలిఫయర్‌-1, ఎలిమినేటర్‌ మ్యాచులకు హైదరా బాద్‌ ఆతిథ్యం ఇవ్వనుండగా.. క్వాలిఫయర్‌-2, ఫైనల్‌కు కోల్‌కతాలో జరగనున్నాయి. మే 25న ఐపిఎల్‌ సీజన్‌-18 టైటిల్‌ సంగ్రామం ఈడెన్‌ గార్డెన్‌లోనే జరగనుంది.

IPL 2025 Complete Final Schedule Single Image Download

➡️