మహరాజ్‌ మాయ

Jun 11,2024 00:20 #Cricket, #South Africa, #T20 world cup
  • బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా సంచలన విజయం

న్యూయార్క్‌: లో స్కోరింగ్‌ మ్యాచ్‌లకు కేరాఫ్‌ అయిన న్యూయార్క్‌ పిచ్‌పై మరో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికా జట్టు నిర్దేశించిన 114పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక బంగ్లాదేశ్‌ జట్టు ఓటమిపాలైంది. చివరి ఓవర్లో 11 పరుగులు చేస్తే బంగ్లాదేశ్‌దే విజయం కాగా.. కేశవ్‌ మహరాజ్‌ వేసిన బౌలింగ్‌లో 6పరుగులే రాబట్టి ఓటమిపాలైంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 113పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లాదేశ్‌ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7వికెట్లు కోల్పోయి 109పరుగులే చేసింది. ఈ గెలుపులో దక్షిణాఫ్రికా జట్టు గ్రూప్‌-సిలో వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకొని 6పాయింట్లతో టాప్‌లో నిలిచింది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకొని పెద్ద తప్పిదమే చేసింది. బౌన్స్‌కు సహకరిస్తున్న పిచ్‌పై సఫారీ జట్టు తొలి నాలుగు వికెట్లను 23పరుగులకే కోల్పోయింది. ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌(0)ను ఎల్బీగా వెనక్కి పంపిన షకిబ్‌.. మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(18)ను బౌల్డ్‌ చేసి సఫారీ జట్టుకు పెద్ద షాకిచ్చాడు. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను తస్కిన్‌ దెబ్బకొట్టాడు. కెప్టెన్‌ ఎడెన్‌ మర్క్‌రమ్‌(4)ను బౌల్డ్‌ చేశాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌(0) సైతం ఔట్‌ కావడంతో దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత డేవిడ్‌ మిల్లర్‌కు జతగా హెన్రిచ్‌ క్లాసెన్‌ వచ్చి వీరిద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా.. భారీ షాట్స్‌ కొట్టడంలో విఫలమయ్యారు. క్రీజ్‌లో కుదురుకున్నా క భారీ షాట్లు ఆడి జట్టు స్కోర్‌ 100 దాటించారు. అయితే.. తస్కిన్‌ అహ్మద్‌ ఓవర్లో డేంజరస్‌ క్లాసెన్‌.. రిషద్‌ బౌలింగ్‌లో మిల్లర్‌ బౌల్డ్‌ కావడంతో సఫారీ జట్టు 113కే పరిమితమైంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ క్లాసెన్‌కు దక్కింది.

స్కోర్‌బోర్డు..
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి)తంజుమ్‌ హొసైన్‌ 18, హెండ్రిక్స్‌ (ఎల్‌బి)తంజుమ్‌ హొసైన్‌ 0, మార్‌క్రమ్‌ (బి)తస్కిన్‌ అహ్మద్‌ 4, స్టబ్స్‌ (సి)షకీబ్‌ (బి)తంజుమ్‌ హొసైన్‌ 0, క్లాసెన్‌ (బి)తస్కిన్‌ అహ్మద్‌ 46, డేవిడ్‌ మిల్లర్‌ (బి)రిషద్‌ హొసైన్‌ 29, జాన్సన్‌ (నాటౌట్‌) 5, మహరాజ్‌ (నాటౌట్‌) 4, అదనం 7. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 113పరుగులు.

వికెట్ల పతనం: 1/11, 2/19, 3/23, 4/23, 5/102, 6/106 బౌలింగ్‌: తంజిమ్‌ హొసైన్‌ 4-0-18-3, తస్కిన్‌ అహ్మద్‌ 4-0-19-2, ముస్తాఫిజుర్‌ 4-0-18-0, రిషద్‌ హొసైన్‌ 4-0-32-1, షకీబ్‌ 1-0-6-0, మహ్మదుల్లా 3-0-17-0

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తంజిద్‌ హసన్‌ (సి)డికాక్‌ (బి)రబడా 9, నజ్ముల్‌ హొసైన్‌ (సి)మార్‌క్రమ్‌ (బి)నోర్ట్జే 14, లింటన్‌ దాస్‌ (సి)డేవిడ్‌ మిల్లర్‌ (సి)మహరాజ్‌ 9, షకీబ్‌ (సి)మార్‌క్రమ్‌ (బి)నోర్ట్జే 3, తౌహిద్‌ హ్రిదరు (ఎల్‌బి)రబడా 37, మహ్మదుల్లా (సి)మార్‌క్రమ్‌ (బి)మహరాజ్‌ 20, జాకెర్‌ అలీ (సి)మార్‌క్రమ్‌ (బి)మహరాజ్‌ 8, రోషద్‌ హొసైన్‌ (నాటౌట్‌) 0, తస్కిన్‌ అహ్మద్‌ (నాటౌట్‌) 1, అదనం 8. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 109పరుగులు.

వికెట్ల పతనం: 1/9, 2/29, 3/37, 4/50, 5/94, 6/107, 7/108 బౌలింగ్‌: జాన్సెన్‌ 4-0-17-0, రబడా 4-0-19-2, బార్ట్‌మన్‌ 4-0-27-0, మహరాజ్‌ 4-0-27-3, నోర్ట్జే 4-0-17-2.

➡️