మైస్మన్‌ సంచలనం

May 15,2024 21:30 #Badminton, #Sports
  • తొలిరౌండ్‌లో ప్రణయ్ కు ఝలక్‌
  • థాయ్ లాండ్‌ ఓపెన్‌

బ్యాంకాక్‌: థాయ్ లాండ్‌ ఓపెన్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో పెను సంచలనం నమోదైంది. 9వ ర్యాంక్‌ ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్ ను భారత్‌కే చెందిన అన్‌సీడెడ్‌ క్రీడాకారుడు మీరాబ లువాంగ్‌ మైస్మన్‌ తొలిరౌండ్‌లో ఝలక్‌ ఇచ్చాడు. అర్హత మ్యాచ్‌లు ఆడి భారత్‌నుంచి మెయిన్‌ డ్రాలోకి ప్రవేశించిన ఏకైక షట్లర్‌ మైస్మన్‌ మాత్రమే. బుధవారం హోరాహోరీగా సాగిన తొలిరౌండ్‌ పోటీలో మైస్మన్‌ 21-19, 21-18తో వరుససెట్లలో ప్రణయ్ ను చిత్తుచేశాడు. ఈ మ్యాచ్‌ కేవలం 55 నిమిషాల్లోనే ముగిసింది. మైస్మన్‌ 85వ ర్యాంక్‌ ప్లేయర్‌. ఇతర తొలిరౌండ్‌ పోటీల్లో కిరణ్‌ జార్జి 15-21, 21-13, 17-21తో మాడ్స్‌ క్రిస్టోఫర్‌(డెన్మార్క్‌), సతీశ్‌ కరుణాకరన్‌ 13-21, 17-21తో హాంకాంగ్‌ చైనా షట్లర్‌ జాసన్‌ గునావాన్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక మహిళల సింగిల్స్‌లో 51వ ర్యాంకర్‌ అస్మిత చాలిహా మినహా.. మిగిలిన షట్లర్లందరూ పరాజయాన్ని చవిచూశారు. తొలిరౌండ్‌లో అస్మిత 19-21, 21-15, 21-14తో 54 నిమిషాల్లో ఇండోనేషియాకు చెందిన ఈస్ట్రన్‌ నురుమూను ఓడించి రెండోరౌండ్‌కు చేరింది. ఫారూఖీ 13-21, 13-21తో గువా(చైనా), మాల్విక బన్సోద్‌ 11-21, 10-21తో హాన్‌(చైనా), హుడా 21-14, 14-21, 9-21తో టాన్‌(జర్మనీ) చేతిలో పరాజయాన్ని చవిచూశారు.

ఇక పురుషుల డబుల్స్‌లో టాప్‌సీడ్‌ చిరాగ్‌శెట్టి-సాత్విక్‌ సాయిరాజ్‌ శుభారంభం చేశారు. తొలిరౌండ్‌లో వీరు 21-13, 21-13తో మలేషియాకు చెందిన టాంగ్‌-వూరు, నూర్‌ మహ్మద్‌లను ఓడించారు. ఇక పురుషుల డబుల్స్‌లో ఎస్‌ పాండా-ఆర్‌ పాండా 21-9, 21-5తో భారత షట్లర్లను చిత్తుచేసి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లారు.

➡️