INDW vs NZW, 3rd ODI : మందన సెంచరీ.. భారత్‌ ఘన విజయం

  • మూడో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలుపు
  • వన్డే సిరీస్‌ 2-1తో టీమిండియా కైవసం

అహ్మదాబాద్‌: టి20 మహిళల ప్రపంచకప్‌ ఛాంపియన్స్‌కు భారత మహిళల జట్టు దిమ్మదిరిగే షాకిచ్చింది. ఆ టోర్నమెంట్‌లో ఎదురైన ఓటమిని అధిగమించి వన్డే సిరీస్‌ను చేజిక్కించుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌ మహిళలతో మంగళవారం జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా ఆరు వికెట్ల ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 233పరుగుల పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్‌ స్మృతి మంధాన(100) సెంచరీకి తోడు.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(59నాటౌట్‌) జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. కివీస్‌ 24 పరుగుల వద్ద ఓపెనర్‌ సుజీ బేట్స్‌(4) వికెట్‌ కోల్పోయింది. జెమీమా రోడ్రిగ్స్‌ మెరుపు త్రోతో ఆమె రనౌట్‌ అయింది. అనంతరం ప్రియా మిశ్రా (2/41)తిప్పేయడంతో ఓపెనర్‌ జార్జియా ప్లిమ్మర్‌(39), కెప్టెన్‌ సోఫీ డెవినె(9)లు వెనుదిరిగారు. ఆ తర్వాత డేంజరస్‌ లారెన్‌ డౌన్‌(1)ను పేసర్‌ సైమా థాకూర్‌ వెనక్కి పంపింది. దాంతో, 88 పరుగులకే కివీస్‌ 5 వికెట్లు కోల్పోయింది. ఇక కివీస్‌ స్కోర్‌ 150 దాటడం గగనమే అనుకన్న దశలో.. బ్రూక్‌ హల్లిడే(86) అర్ధసెంచరీతో ఆదుకుంది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఆమె మ్యాడీ గ్రీన్‌(15), ఇసాబెల్లా గేజ్‌(39)లతో కలిసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించింది. మూడు భారీ సిక్సర్లు బాదిన హల్లిడే సెంచరీకి ముందు దీప్తి శర్మ ఓవర్లో రాధా యాదవ్‌ చేతికి చిక్కింది. ఆ తర్వాత హన్నా రొవే(11), లీ తహుహు(24)లు పట్టుదలగా ఆడారు. రేణుకా వేసిన 49వ ఓవర్‌ ఆఖరి బంతిని తహుహు సిక్సర్‌గా మలిచింది. సైమా వేసిన 50వ ఓవర్లో బౌండరీ బాదిన లిహిహు జట్టు స్కోర్‌ 230 దాటించింది. హల్లిడే, తహుహుల పోరాటంతో భారత్‌కు కివీస్‌ 233 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీప్తి శర్మకు మూడు, ప్రియా మిశ్రాకు రెండు, రేణుక, సైమాకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

ఛేదనలో టీమిండియా స్టార్‌ షెఫాలీ వర్మ(12) నిరాశపరిచినా.. మంధాన మెరుపు శతకంతో రాణించింది. మంధాన 122బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసుకొని హనా రౌస్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యింది. యాస్టికా(35), హర్మన్‌(59నాటౌట్‌), రోడ్రిగ్స్‌(22) టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించారు. దీంతో భారత్‌ 44.2ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 236పరుగులు చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మంధానాకు, సిరీస్‌ దీప్తి శర్మకు దక్కాయి.

స్కోర్‌బోర్డు…
న్యూజిలాండ్‌ మహిళల ఇన్నింగ్స్‌: సూజీ బేట్స్‌ (రనౌట్‌) రోడ్రిగ్స్‌/యాస్టికా 4, ప్లిమెర్‌ (సి)దీప్తి (బి)ప్రియా మిశ్రా 39, లారెన్‌ డౌన్‌ (సి)యాస్టికా భాటియా (బి)సైమా ఠాకూర్‌ 1, సోఫీ డివైన్‌ (బి)ప్రియా మిశ్రా 9, బ్రూక్‌ హల్లిడై (సి)రాధా యాదవ్‌ (బి)దీప్తి శర్మ 86, గ్రీన్‌ (రనౌట్‌) రోడ్రిగ్స్‌/యాస్టికా 15, ఇసాబిల్లా గాజే (సి అండ్‌ బి)దీప్తి 25, హన్నాV్‌ా రో (ఎల్‌బి)దీప్తి 11, లీ తహుహు (నాటౌట్‌) 24, ఈడెన్‌ కార్సన్‌ (సి)రాధా యాదవ్‌ (బి)రేణుకా సింగ్‌ 2, ఫ్రాన్‌ జొనాస్‌ (రనౌట్‌) సైమా ఠాకూర్‌ 2, అదనం 14. (49.5ఓవర్లలో ఆలౌట్‌) 232పరుగులు.
వికెట్ల పతనం: 1/24, 2/25. 3/36, 4/66, 5/88, 6/152, 7/199, 8/210, 9/219, 10/232
బౌలింగ్‌: రేణుకా సింగ్‌ 10-1-49-1, సైమా ఠాకూర్‌ 9.5-1-44-1. ప్రియా మిశ్రా 10-1-41-2, దీప్తి శర్మ 10-2-39-3, రాధా యాదవ్‌ 4-0-21-0, హర్మన్‌ప్రీత్‌ 6-0-34-0

ఇండియా మహిళల ఇన్నింగ్స్‌: మంధాన (బి)హన్నాV్‌ా రో 100, షెఫాలీ వర్మ (సి)ఇసాబెల్లా గాజే (బి)హన్నాV్‌ా రో 12, యాస్టికా భాటియా (సి అండ్‌ బి)సోఫియా డివైన్‌ 35, హర్మన్‌ప్రీత్‌ (నాటౌట్‌) 59, రోడ్రిగ్స్‌ (ఎల్‌బి)ఫ్రాన్‌ జొనాస్‌ 22, తేజల్‌ (నాటౌట్‌) 0, అదనం 8. (44.2 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 236పరుగులు.
వికెట్ల పతనం: 1/16, 2/92, 3/209, 4/232
బౌలింగ్‌: తహుహు 6-0-30-0, హన్నా రో 8-0-47-2, సోఫీ డివైన్‌ 7.2-0-44-1, సూజీ బేట్‌ 4-0-18-0, ఫ్రాన్‌  9-1-50-1.

➡️