మాస్టర్స్‌ క్రికెట్‌ టైటిల్‌ పోరు నేడు

Mar 16,2025 00:01 #Cricket

ఫైనల్లో వెస్టిండీస్‌తో తలపడనున్న భారత్‌
రాయ్ పూర్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాళ్ల మధ్య జరిగే మాస్టర్స్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. శుక్రవారం జరిగిన రెండో సెమీస్‌లో వెస్టిండీస్‌ జట్టు 6పరుగుల తేడాతో శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. తొలుత బ్రయాన్‌ లారా(41), రామ్‌దిన్‌(50నాటౌట్‌), వాల్టన్‌(31) రాణించడంతో వెస్టిండీస్‌ జట్టు 179పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 9వికెట్లు కోల్పోయి 173పరుగులే చేసింది. గుణరత్నే(66), తరంగ(30), ఇసురు ఇదాన(21) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో వెస్టిండీస్‌ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. విండీస్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ టినో బెస్ట్‌ (4/27) అత్యుత్తమంగా రాణించగా.. డ్వేన్‌ స్మిత్‌ రెండు, ఆష్లే నర్స్‌, జెరోమ్‌ టేలర్‌, లెండిల్‌ సిమ్మన్స్‌ ఒక్కో వికెట్‌ తీశారు. మాస్టర్స్‌ లీగ్‌కు ఈ ఏడాది శ్రీకారం చుట్టారు. ఇండియా మాస్టర్స్‌, శ్రీలంక మాస్టర్స్‌, ఇంగ్లండ్‌ మాస్టర్స్‌, సౌతాఫ్రికా మాస్టర్స్‌, ఆస్ట్రేలియా మాస్టర్స్‌, వెస్టిండీస్‌ మాస్టర్స్‌ జట్లు ఇందులో భాగమయ్యాయి. తొలి సెమీస్‌లో ఇండియా మాస్టర్స్‌ 94పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

➡️