Monte Carlo Masters: టైటిల్‌ అల్కరాజ్‌ కైవసం

మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత కార్లోస్‌ అల్కరాజ్‌ మరోసారి టాప్‌-2 స్థానానికి ఎగబాకాడు. మోంటేకార్లో మాస్టర్స్‌ టైటిల్‌ను తొలిసారి చేజిక్కించుకున్న అల్కరాజ్‌ తాజా ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత, ఇటలీకి చెందిన మసెట్టిపై 3-6, 6-1, 6-0తో విజయం సాధించాడు. హోరాహోరీసాగిన ఫైనల్లో టైటిల్‌ నెగ్గిన అల్కరాజ్‌ కెరీర్‌లో మూడు ఎటిపి సూపర్‌-1000 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 23ఏళ్ల ఇటలీకి చెందిన మసెట్టి ఎటిపి ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో నిలువగా.. తొలిసారి మోంటేకార్లో ఫైనల్‌కు చేరాడు. తాజా ఎటిపి ర్యాంకింగ్స్‌లో జెన్నిక్‌ సిన్నర్‌(ఇటలీ) 9,930పాయింట్లతో మరోసారి అగ్రస్థానంలో నిలువగా.. మాజీ టాప్‌సీడ్‌ ఆటగాడు, 24గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత, సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌ 4,120పాయింట్లతో 5వ స్థానంలో ఉన్నాడు. పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన యుకీ బాంబ్రీ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 26వ స్థానంలో నిలువగా.. రోహన్‌ బొప్పన్న-39, శ్రీరామ్‌ బాలాజీ 63, రుత్విక్‌ చౌదరి 73, అనిరుధ్‌ చంద్రశేఖర్‌ 97వ స్థానాల్లో ఉన్నారు. సింగిల్స్‌లో సుమిత్‌ నాగల్‌ 171, ముకుంద్‌ వశికుమార్‌ 445, ఆర్యాన్‌ షా 467వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

ఎటిపి టాప్‌-10 ర్యాంకింగ్స్‌…
1. జెన్నిక్‌ సిన్నర్‌(ఇటలీ) : 9,930
2. కార్లోస్‌ అల్కరాజ్‌(స్పెయిన్‌) : 7,720
3. అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌((జర్మనీ) : 7,595
4. టేలర్‌ ఫ్రిట్జ్‌(అమెరికా) : 5,280
5. నొవాక్‌ జకోవిచ్‌(సెర్బియా) : 4,120
6. జాక్‌ డ్రాపర్‌(బ్రిటన్‌) : 3,870
7. అలెక్స్‌-డి-మినర్‌(ఆస్ట్రేలియా): 3,535
8. ఆండీ రుబ్లేవ్‌(రష్యా) : 3,490
9. డానియేల్‌ మెద్వదెవ్‌(రష్యా) : 3,290
10. కాస్పెర్‌ రూఢ్‌(నార్వే) : 3,215

➡️